12-12-2025 06:11:14 PM
వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో ఈనెల 14వ తేదీన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు. రెండో విడత ఎన్నికలు జరిగే వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత ఐదు మండలాల పరిధిలో నేటి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు.
ఆ తర్వాత ఎటువంటి బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదని తెలిపారు. సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం ఈ ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి అమలులోకి వస్తాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎవరైనా ఇతర ప్రాంతవాసులు ఉంటే వెళ్లిపోవాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 14వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.