calender_icon.png 12 August, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూఢనమ్మకాలను నమ్మొద్దు

14-05-2025 11:54:59 PM

వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలి..

అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి..

త్వరలోనే జిల్లా పోలీసు యంత్రాంగం తరపున జాబ్ మేళా..

ఎస్పీ అఖిల్ మహాజన్..

బోథ్ (విజయక్రాంతి): వైద్యుల సలహాలు సూచనల మేరకే మందులు వాడాలని, మూఢ నమ్మకాలను, నాటు వైద్యాన్ని ఆచరించొద్దని అదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) ఆదివాసీలకు సూచించారు. బోథ్ మండలం పట్నాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో పాల్గొనడానికి బుధవారం గ్రామానికి వచ్చిన ఎస్పీకి ఆదివాసీలు ఘనస్వాగతం పలికారు. మారుమూల ఆదివాసీ గ్రామాలలో ఉంటున్న ప్రజలకు వైద్య సేవలను అందించాలనే సద్దుదేశంతో జిల్లా పోలీసు యంత్రాంగం తరపున పట్నాపూర్ గ్రామంలో జిల్లా వైద్యశాఖ, స్వప్న సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, యూరాలజీ, గైనకాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిషన్, ఆర్థోపెడిక్ లలో నిష్ణాతులైన వైద్య బృందంచే పరీక్షలు జరిపి ఉచితంగా మందులు గోళీలు అందజేశారు. 

ఈ మేరకు ఎస్పీ మాట్లాడుతూ.... ఆదివాసీలు గంజాయికి దూరంగా ఉండాలని, గంజాయిని పండించడం వాడటం వ్యాపారం చేయడం వల్ల సమాజం నష్టపోతుందని అదేవిధంగా దానికి బానిస ఆయన కుటుంబాలు రోడ్డున పడతాయని తెలియజేశారు. ముఖ్యంగా యువత రోడ్డు ప్రమాదాలు జరగకుండా సరైన వయస్సు వచ్చిన తర్వాతనే లైసెన్స్ తీసుకొని వాహనాలను నడపాలని, మైనర్‌లు డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు కారణమై ప్రాణనష్టం సంభవిస్తుందని తెలిపారు. వాహనం నడిపే సమయంలో రోడ్డు నియమాలను సక్రమంగా పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. యువత సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలని, ప్రస్తుత సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న నూతన పద్ధతులపై ప్రజలకు యువతకు వివరించారు. 

అదేవిధంగా డయల్ 100 ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎలాంటి అత్యవసర సమయంలోనైనా డయల్ 100 ను సంప్రదించాలని జిల్లా పోలీసు యంత్రాంగం నిమిషాల వ్యవధిలో సంఘటన స్థలాలకు చేరుకొని సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. త్వరలోనే జిల్లా పోలీసు యంత్రాంగం తరపున జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని నిరుద్యోగ యువతీ యువ-కులు సద్వినియోగం చేసుకోవాలని కేటాయించిన ప్రదేశాలలో విధులను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్ రావు, ఎస్ఐ ప్రవీణ్, వైద్యాధికారి రవీంద్ర ప్రసాద్, పంద్రం శంకర్, పలువురు డాక్టర్లు పీహెచ్సీ వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.