calender_icon.png 12 August, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల ఎగవేత ఓట్ల చోరీ కాదా?

12-08-2025 12:57:17 AM

  1. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమైనయ్?
  2. రూ.8 లక్షల కోట్ల అప్పు అని మాపై సీఎం అసత్య ప్రచారం
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. వాటిని ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ పేర్కొన్నది. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు స్టాంపు పేపర్లు రాసిచ్చారు. వంద రోజుల్లో పథకాలు అమలు చేస్తామని బీరాలు పలికారు. ఓట్లు వేయించుకుని, అధికారం చేపట్టాక మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు.

ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, ఆ తర్వాత అమలు చేయలేదు. హామీల ఎగవేత ఓట్ల చోరీ కాదా ?’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం ‘ఎక్స్’లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ‘కాగ్’ విడుదల చేసిన త్రైమాసిక నివేదికపైనా స్పందించారు. నివేదిక ప్రకారం.. తెలంగాణ ఆదాయం బాగా తగ్గి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నదని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే  రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయని, అప్పులు అ మాంతం పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2,738 కోట్ల మిగులు ఉందని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చూపిందని, కానీ.. కాగ్ నివేదికలో మొదటి త్రైమాసికానికే రూ.10 ,583 కోట్ల రెవెన్యూ లోటు ఉందని తెలిపా రు.

రాష్ట్రప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే రూ.20,266 కోట్ల అప్పు చేసిందని పేర్కొన్నారు. రాషట్రంలో ఒక్క రోడ్డు వేయకుం డా, కొత్త ప్రాజెక్టు కట్టకుండా అంత అప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని ఎలా గాడిన పెడతారో కాంగ్రెస్ పెద్దలు సమాధానం ఇవ్వాలని నిలదీశారు.

పథకాలు, పనుల కోసమే బీఆర్‌ఎస్ అప్పులు

బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి నోరుపారేసుకున్నారని, అందుకు సమాధానంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అప్పు 3.5 లక్షల కోట్లు మాత్రమేనని ప్రకటించిందని గుర్తుచేశారు. దీంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం తలకు మించిన అప్పులు చేయలేదని, తీసుకువచ్చిన అప్పులను సైతం తాము సంక్షేమ పథకాల కోసమే వెచ్చించామని పేర్కొన్నారు. ఆ నిధులను మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు పనులకూ వెచ్చించామని స్పష్టం చేశారు. 2023--24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు రూ.3,50,520.39 కోట్లు అని, అలాగే ప్రభుత్వ ఆస్తుల విలువ రూ. 4,15,099.69 కోట్లుగా ఉండేదన్నారు.

దీన్నిబట్టి, అప్పుల కంటే రాష్ట్ర ఆస్తుల విలువ రూ. 64,579 కోట్లు ఎక్కువగా ఉందనేది స్పష్టమవుతుందన్నారు. 2018--19 నుంచి 2023--24 వరకు రాష్ట్ర అప్పుల కంటే ఆస్తుల విలువ రూ.50 వేల కోట్లకు పైగా పెరిగిందని పేర్కొన్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ మార్గాల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పులు చేశారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రే అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారని గుర్తుచేశారు.

సీఎం అనాలోచిత నిర్ణయాలు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణతో రాష్ట్రం ఆర్థిక సంభంలోకి కూరుకుపోయిందని విమర్శించారు. సీఎం పారదర్శకత లేని ఆర్థిక విధానాలను అవలంబిస్తూ, అప్పులను ప్రజల మీద మోపుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తమ పరిపాలన గురించి ఒకసారి సమీక్షించుకోవాలని హితవు పలికారు.