24-07-2025 07:32:58 PM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్..
గద్వాల (విజయక్రాంతి): ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్(District Collector B.M. Santosh) అన్నారు. గురువారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రభుత్వ ఆసుపత్రులు, పీ.హెచ్.సీల పనితీరుపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపి శాతం ఎక్కువగా ఉండేలా వైద్య సేవలు అందించాలని అన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది సమయపాలన పాటించేందుకు బయోమెట్రిక్ తప్పక అమలు చేయాలని, ఆసుప్రతిలో డెలివరీల సంఖ్యను పెంచేందుకు అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుని, సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హై రిస్క్ కేసుల హిస్టరీని పరిశీలించుకుని తగిన వైద్య సేవలను అందించాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రిజిస్టర్లు పూర్తి స్థాయిలో ఉండాలని సూచించారు. రోగ నిర్ధారణలో లోపాలు లేకుండా ఉండేందుకు ల్యాబ్ టెస్టులు ఖచ్చితంగా,ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలని అన్నారు. క్లిష్టమైన కేసులను వెంటనే జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యాధుల పట్ల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ,క్షయ వ్యాధి నిర్మూలనకు జిల్లా స్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని అన్నారు.ప్రోగ్రామ్ ఆఫీసర్లు,మల్టీ పర్పస్ హెల్త్ సూపర్వైజర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్లు చేయాలని సూచించారు. స్వయంగా ఆకస్మికంగా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సందర్శిస్తానని తెలిపారు. వైద్యారోగ్య శాఖ ద్వారా పెద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి సిద్ధప్ప,మెడికల్ ఆఫీసర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్,హెల్త్ సూపర్వైజర్స్,తదితరులు పాల్గొన్నారు.