26-07-2025 07:40:22 PM
నారాయణపేట (విజయక్రాంతి): నారాయణపేట జిల్లాలో జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేసేందుకు వైద్య శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్(District Additional Collector Sanchit Gangwar) సూచించారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్లో వైద్యశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీవో 54 ప్రకారం ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించి, జనరిక్ మందుల ప్రమోట్ చేసేలా చూడాలని చెప్పారు. ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో జనరిక్ మందుల దుకాణం ఏర్పాటు చేయించేందుకు వైద్య శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.
ప్రస్తుతం జిల్లాలో ఎన్ని జనరిక్ మెడికల్ స్టోర్ లు ఉన్నాయని అదనపు కలెక్టర్ ప్రశ్నించగా జిల్లాలో మక్తల్, కోస్గి, నారాయణపేట పట్టణంలో మొత్తం మూడు ఉన్నాయని పీవో బిక్షపతి తెలిపారు. అయితే ఆ మూడింటితో పాటు మరికొన్ని జనరిక్ మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేసేందుకు వారం రోజులలో ప్రణాళికను తయారు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అప్పక్ పల్లి వద్ద ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జనరిక్ మెడికల్ స్టోర్ ను వీలైనంత తొందరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జనరిక్ మెడికల్ స్టోర్ ను డీఆర్ డీ ఏ ద్వారా మహిళా సంఘాల సభ్యులు, లేదా స్వచ్ఛంద సంస్థ సభ్యులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులలో ( బీ ఫార్మసీ చేసిన వారు) ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
మద్దూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వైద్యులు జనరిక్ మందులనే రాయాలని ఆయన స్పష్టం చేశారు. వారం రోజుల్లో జనరిక్ మెడికల్ స్టోర్ లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ మొగులప్ప, వైద్య విధాన పరిషత్ నుంచి ఏ వో గంగాధర్, జిల్లా ఆస్పత్రి వైద్యులు శైలజ, ఆదిత్య, ఐఎంఏ ( ఇండియన్ మెడికల్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మల్లికార్జున్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతి, సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఫార్మసిస్ట్ తుల్జారాం తదితరులు పాల్గొన్నారు.