దేనినైనా గుడ్డిగా అనుమానించొద్దు

27-04-2024 02:12:58 AM

l వీవీప్యాట్ లెక్కింపు కేసులో సుప్రీం ధర్మాసనం తీర్పు

l అన్ని వీవీప్యాట్ పేపర్లను లెక్కించాలన్న పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం

స్యూఢిల్లీ, ఏప్రిల్ 26: లోక్‌సభ ఎన్నికల వేళ వీవీప్యాట్ లెక్కింపుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీవీప్యాట్ పేపర్లను వంద శాతం లెక్కించి ఎన్నికల ఫలితాలతో పోల్చి చూడాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టేసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు  చేసింది. దేశంలోని వివిధ సంస్థలు, శాఖల మధ్య సామరస్యత, నమ్మకంపైనే ప్రజాస్వామ్యం మనుగడ సాగుతోందని వ్యాఖ్యానించింది. గుడ్డిగా ఎన్నికల విధానాన్ని అనుమానిస్తే అనవసరమైన అనుమానాలకు తావిచ్చినట్టు అవుతుందని పేర్కొంది. అలాగే ఈవీఎం ద్వారా కాకుండా తిరిగి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న విజ్ఞప్తని కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘ఎన్నికల విధానంపై సాంకేతికపరమైన అంశాలతో పాటు సంప్రదాయాలను వి స్తృతంగా చర్చించాం. ఆ తర్వాత పిటిషన్లను తిరస్కరించాం. గుడ్డిగా ఓ వ్యవస్థను అనుమానిస్తే ఆ తర్వాత అనవసరమైన మరిన్ని అనుమానాలకు దారిచ్చినట్టు అవుతుంది’ అని ద్విసభ్య ధర్మాసనం వివరించింది.

ఈసీకి ధర్మాసనం సూచనలు

ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు పలు జాగ్రత్తలు, సూచనలు చేసింది. గుర్తులను ఈవీఎంలోకి లోడ్ చేయడం అయిపోయిన తర్వాత సింబ ల్ లోడింగ్ యూనిట్ (ఎస్‌ఎల్‌యూ)ను సీల్ వేసి ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని సూచించింది. అందరు అభ్యర్థుల సమక్షంలో ఎస్‌ఎల్‌యూకు సీల్ వేసి, వారందరి సంతకం తీసుకోవాలని తెలిపింది. ఫలితాలు ముగిసిన తర్వాత ట్యాంపరింగ్  జరిగిందంటూ ఎవరైనా అభ్యర్థి అనుమానం లేవనెత్తితే ఈవీఎం మైక్రో కంట్రోలర్‌లోని మెమోరీని ఇంజనీర్ల బృందం తనిఖీ చేయాలి. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు మాత్రమే ఈ అభ్యర్థన చేయాలని, అది కూడా ఫలితాలు వెలువడిన వారంలోపే కోరాలని సూచించింది. దీనికి సంబంధించిన ఖర్చులను సదరు అభ్యర్థే భరించాల్సి ఉంటుంది. అయితే ట్యాంపరింగ్ జరిగిందని నిరూపణ అయితే మాత్రం ఆ డబ్బును అభ్యర్థికి తిరిగి ఇవ్వాలి.

కుదురుతుందో చూడండి

కాగా, వీవీప్యాట్ పేపర్లను ఏదైనా మెషీన్‌తో లెక్కించడానికి ఏమైనా అవకాశాలు కుదిరితే చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు సూచించింది. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ స్థానంలోని కాకతాళీయంగా ఐదు మెషీన్లను ఎంచుకుని వాటిలో వీవీప్యాట్ పేపర్లను అధికారులు లెక్కించి ఫలితాలను బేరీజు వేస్తున్నారు.