06-11-2025 12:20:30 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
కొల్చారం, నవంబర్ 5 :జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కొల్చారం మండల పరిధిలోని సంగయ్యపేట గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
జిల్లాలో ఇప్పటివరకు 34,520 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రంలో నిర్దేశించిన రిజిస్టర్లు నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించారు. అదేవిధంగా కలెక్టర్ స్వయంగా తేమ శాతాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన వెంటనే సీరియల్ నెంబర్ల వారీగా ఎంత ధాన్యం తెచ్చారు, ధాన్యం తేమ తెచ్చిన రోజు ఎంత ఉంది అనే వివరాలు రిజిస్టర్లలో నమోదు చేసుకోవాలని తెలిపారు.
నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని వెంటనే లోడ్ చేసి పంపించాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సన్న రకం వరి ధాన్యాన్ని, దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గతంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారు మాత్రమే కొనుగోళ్ళ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు.