25-10-2025 01:09:35 AM
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలిగించొద్దని, ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అనంతరం మోడల్ స్కూల్ లో ఇద్దరు ఉపాధ్యాయుల ప్రవర్తన వివాదాస్పదం కావడంతో ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ప్రభుత్వ గురుకులాలు, విద్యాలయాల పని తీరు పై మురళి నాయక్ డీఈవో ఇతర అధికారులతో సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తోందని, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎవ్వరూ ఆటంకం కలిగించకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారు. టీచర్ల మధ్య విభేదాలు, పాఠశాలపై నిర్లక్ష్యం చూపడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పని చేస్తోందని, ఉపాధ్యాయులు కూడా ఆ బాధ్యతను గుర్తుంచుకోవాలన్నారు. మోడల్ స్కూల్ అంటే అందరికీ ఆదర్శం కావాలని, సమస్యల కేంద్రంగా మారకూడదని హెచ్చరించారు.