calender_icon.png 25 October, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు బెర్తులకు పోటాపోటీ!

25-10-2025 01:11:29 AM

త్వరలో మంత్రివర్గ విస్తరణ?

ఐదారుగురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు

కొందరు  మంత్రుల మధ్య కొట్లాటను సీరియస్‌గా పరిగణిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం 

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి):  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి  వచ్చే డిసెంబర్ 7 నాటికి రెండేళ్లు పూర్తి అవుతుంది. అయినా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు ఇంకా పూర్తవలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో బాటు క్యాబినెట్‌లో 1౫ మంది మంత్రులు ఉన్నారు. ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. ఈ ఖాళీ బెర్తులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు  కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించినట్లు  తెలు స్తోంది. 

ఇలాఉండగా, ఇటీవల వరుసగా మంత్రుల మధ్య వివాదాలు ప్రభుత్వానికి, పార్టీకి తలనొప్పిగా మారాయి.  దీంతో వచ్చే  డిసెంబర్ లేదా జనవరి రెండోవారంలో మరోసారి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆలోపు డీసీసీలకు కొత్త అధ్యక్షులను నియమించడం, మిగతా పార్టీ పదవులను కూడా భర్తీ చేయడం పూర్తవుతుంది. మరోవైపు, కోర్టు తీర్పు అనుసరిం చి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లే అంశంపైన క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

రెండేళ్లు కావస్తున్నా పూర్తిస్థా యిలో క్యాబినెట్  నియమించుకోలేని స్థితి లో ప్రభుత్వం ఉందని రాజకీయ వర్గాల నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనే ఆలోచనతో పార్టీ అధిష్ఠానం ఉంది. జిల్లా లు, కుల, సీనియార్టీ,  రాజకీయ సమీకరణాల కారణంగానే  పూర్తిస్థాయిలో మంత్రి వర్గం నియామకం జరగలేదంటున్నారు.

2023 డిసెంబర్ 7న  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, 11 మంది మంత్రులు ప్రమాణస్వీ కారం చేయగా, 14 నెలల తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి.. వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్,  వాకిటి శ్రీహరికి క్యాబినెట్‌లో చోటు కల్పించిన విషయం తెలిసిందే. క్యాబినెట్‌లో ఖాళీగా ఉన్న మూడు బెర్తులను భర్తీ చేస్తే .. సీఎం రేవంత్‌రెడ్డితో సహా మం త్రుల సంఖ్య 18కి చేరుకుంటుంది.  

ఇక, కొందరు మంత్రులు తమ శాఖలపై పట్టు సాధించలేదనే విమర్శలు ఉన్నాయి. దానితో ఐదారుగురి మంత్రుల  శాఖలను కూడా  మార్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా, ఒక మంత్రి శాఖలో మరో మంత్రి జోక్యం చేసుకోవడం కూడా ప్రభుత్వానికి, పార్టీకి తలనొప్పిగా మారుతోంది. దీంతో మంత్రుల మధ్య విభేదాలు  తలెత్తడం,  ఈ విషయం బయటికి పొక్కడం, ప్రతిపక్షాలకు మిమర్శనాస్త్రాలుగా లభించడం వంటి అంశాలను కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకున్నది.

అంతే కాకుండా కొందరు మంత్రులకు తమ పేఫీల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఉన్నతాధికారులు కూడా మంత్రుల ఆదేశాలను పట్టించుకోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అబ్కారీ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు తమ శాఖల్లోని ఉన్నతాధికారుల నుంచి చేదు అనుభవాలు ఎదురైన విషయం  తెలిసిందే. అంతేకాకుండా అటవీ, పర్యావరణకు శాఖలో మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే.. మరో మంత్రి వివేక్  సమీక్ష నిర్వహిం చడం, దీనితో మంత్రి సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.  

ఇదిలాఉండగా, మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారనుంది. జిల్లాలు, కుల సమీకరణలు, సీనియార్టీని పరిగణలోకి తీసుకొని ఖాళీ బెర్తులను భర్తీచేయాల్సి ఉంటుంది. అయితే ఒకటి, రెండు జిల్లాలలో ఒకే సామాజికవర్గం నుంచి తీవ్ర పోటీ నెలకొన్నది.   రేవంత్‌రెడ్డి క్యాబినెట్‌లో  ఇప్పటివరకు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు  చోటు దక్కలేదు. 

మహబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు ముగ్గురు చొప్పున మంత్రులు ఉండగా, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరు మంత్రులు, మెదక్, అదిలాబాద్ నుంచి ఒక్కో మంత్రి ఉన్నారు. అయితే వచ్చే మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజాబాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయా జిల్లాల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ నుంచి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు మంత్రులుగా ఉండగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య  మంత్రి పదవి కావాలని పట్టుపడుతున్నారు.

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  సమ యం చిక్కినప్పుడల్లా  పార్టీ, ప్రభుత్వంపై  తన తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇక నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావు,  రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మె ల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిలు, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి అజారుద్దీన్‌కు మైనార్టీ కోటాలో మంత్రిగా అవకాశమివ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే అజారుద్దీన్‌ను  గవ ర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినెట్ చేసిన విషయం తెలిసిందే.