20-08-2025 12:54:35 AM
వికారాబాద్, ఆగస్టు- 19 (విజయక్రాంతి): రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం సరైన పద్ధతి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని చెప్పారు. మంగళవారం వికారాబాద్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఇప్పటికే బీసీబీ, బీసీఈ, ఈబీసీ కింద రిజర్వేషన్లు అమలవుతున్నాయని, కొత్తగా రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం సరికాదని చెప్పారు.
మతం ఆధారంగా రిజర్వేషన్లకు మాత్రం బీజేపీ వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రైతుబంధును పూర్తిగా ప్రభుత్వం బందు చేసిందని ఆరోపించారు. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ లేదని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సరిపడా యూరి యా ఇవ్వడం లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు అబద్ధపు ప్రచా రం చేస్తూ బీజేపీని బద్నా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో యూరియా కొరతకు, రైతులు పడుతున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని భరోసా వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరి జిల్లాగా మారుస్తామని చెప్పారు. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా, దక్షిణ ఊటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. అనంత పద్మనాభస్వామి ఆశీర్వా దంతో రానున్న రోజుల్లో వికారాబాద్‌లో బీజేపీ మూడు అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిచేలా కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
కాగా వికారాబాద్ జిల్లాకు 14 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే.. కేవలం 73 ఇళ్ల పనులు మాత్రమే ప్రారంభించారని చెప్పారు. వాటిని అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి తదితరులు రాంచందర్‌రావును సన్మానించారు. రాష్ట్ర నాయకులు శివరాజ్, నియోజకవర్గ ఇన్ చార్జి వడ్ల నందు పాల్గొన్నారు.