calender_icon.png 13 August, 2025 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడిగుడ్డునూ వదలరా!

13-08-2025 01:03:39 AM

  1. రాష్ర్టంలో 600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం!

రేవంత్‌రెడ్డి పాలనలో చిరు కాంట్రాక్టర్లకు అన్యాయం

సీఎస్, ఏసీబీకు ఫిర్యాదు చేస్తాం

బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ. 600 కోట్ల రూపాయల కోడిగుడ్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లా డారు. గురుకులాలు ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే కోడిగుడ్ల ధరను కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5.50 పైసల నుంచి రూ.7 రూపాయలకు పెంచిందని పేర్కొన్నారు.

గతంలో ఇచ్చిన కోడిగుడ్ల బరువు 50 నుంచి 60 గ్రాములు ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం కోడిగుడ్ల బరువు 42 నుంచి 50 గ్రాములకు తగ్గించిందన్నారు. గతంలో కోడిగుడ్ల కంట్రాక్టు రావాలంటే ఎలాంటి వార్షిక టర్నోవర్ చూపించాల్సిన అవసరం ఉండేది కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం టర్నోవర్ కనీసం రూ.3 కోట్లు ఉన్న వారికే కాంట్రాక్టు ఇచ్చేలా జీవో నెం. 17 తీసుకొచ్చిందని, ఫౌల్ట్రీ ఫాం,

ఆగ్‌మార్క్ కలిగిన వారికే కోడిగుడ్ల కాంట్రాక్టులు దక్కేలా నిబంధనలు మార్చారని, ఇవి పేదలను కాంట్రాక్టర్లకు దూరం చేసే కుట్రలో భాగమేనన్నారు. గతంలో టెండర్ ఫారమ్ కేవలం రూ.500 నుంచి రూ.1000 ఉండేదని, ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ ఫారమ్ ధర రూ.25,000కు పెంచిందన్నారు.  ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ఇఎమ్‌డీ 40 శాతం రాయితీని ప్రస్తుతం తొలగించారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆంధ్ర బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ వర్గీయులకే టెండర్లు వచ్చేలా సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గతంలో స్థానికులకు కాంట్రాక్టర్లుగా అవకాశం ఇచ్చేవారని, కానీ ఇపుడు మండలాన్ని ఒక యూనిట్‌గా చేసి ఒక్కరికే కాంట్రాక్ట్ ఇచ్చేలా నిబంధనలు మార్చారని విమర్శిం చారు.

జీవో నెం 17 వల్ల సుమారు 20 వేల మంది పేద వర్గాల కాంట్రాక్టర్లు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. గతంలో క్యాటరింగ్ కాంట్రాక్టుకు కేవలం రూ.75 వేల డిపాజిట్ ఉండేది, కానీ ఇపుడు సుమారు  రూ.5 లక్షల డిపాజిట్, వార్షిక టర్నోవర్ సర్టిఫికెట్ కలిగి ఉండాలంటున్నారని చెప్పారు.

గతంలో టెండర్ వెరిఫికేషన్ అధికారం పాఠశాల హెచ్‌ఎం చేతిలో ఉండేదని, ఇప్పుడు కలెక్టర్ చేతికి అప్పగించడంతో కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల కమీషన్లు అడుగుతున్నారని, ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. కమీషన్లు అడిగే కలెక్టర్లపై చీఫ్ సెక్రటరీ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. జీవో నెం 17 రద్దు కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇప్పుడు 4 నెలలు దాటినా బిల్లులు ఇవ్వడం లేదన్నారు.