వారసత్వ ఆస్తుల్నీ వదలరట!

25-04-2024 03:00:05 AM

కాంగ్రెస్ రహస్య అజెండా బట్టబయలు

l కాంగ్రెస్ రహస్య ఎజెండా బట్టబయలు

l ఆ పార్టీ వస్తే మీ ఆస్తులు లాగేసుకుంటుంది

l యువరాజు సలహాదారు కూడా అదే చెప్పారు

l మీ కష్టార్జితాన్ని మీ పిల్లలకు కాకుండా చేస్తది

l ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

l పిట్రోడా పితలాటకం

l సీరియస్ ఎన్నికల వేల టంగ్ స్లిప్

న్యూల్లీ, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ విభాగం అధ్యక్షుడు సామ్ పిట్రోడా వ్యాఖ్యలతో ఆ పార్టీ రహస్య ఎజెండా బట్టబయలైందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను లాగేసుకొంటుందని అన్నారు. బతికున్నప్పుడే కాదు.. మరణించిన తర్వాత కూడా ప్రజలపై పన్నుల భారం మోపాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గూజాలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ప్రధాని మాజీ సలహాదారు, కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని విపక్ష పార్టీపై దుమ్మెత్తిపోశారు. 

పిట్రోడా ఏమన్నారు?

కాంగ్రెస్ అంతర్జాతీయ వ్యవహారాలు చూసే సామ్ పిట్రోడా యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రధానికి సలహాదారుగా పనిచేశారు. దేశంలోని ప్రముఖ మేధావుల్లో ఆయన కూడా ఒకరు. ఏఎన్‌ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోపై ప్రధాని చేస్తున్న విమర్శలపై స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆర్థికవ్యవస్థలో అట్టుడుగున ఉన్నవారిపైనే దృష్టిపెడుతుంది. వాళ్లు ఓబీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ముస్లింలు కావచ్చు.. కోటీశ్వరులకు ప్రభుత్వ సహాయం అవసరం ఉండదు. పేదలకే సాయం అవసరం. గత పదేండ్లలో దేశంలో ఆర్థిక అంతరాలు భారీగా పెరిగిపోయాయి.

సంపద సమాన పంపిణీ అంటే ఒకరి ఆస్తులు లాక్కొని మరొకరికి ఇవ్వటం కాదు. సంపద కేంద్రీకరణ జరుగకుండా ఆపటం. అంటే ఏకస్వామ్యాన్ని నిరోధించటం. అమెరికాలో వారసత్వ పన్ను అని ఒకటున్నది. ఒక వ్యక్తి వంద మిలియన్ డాలర్లు సంపాదించారనుకోండి. ఆయన మరణించిన తర్వాత అతని వారసులకు అందులో 45 శాతమే చెందుతుంది. మిగతా 55 శాతం ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఇదొక ప్రత్యేకమైన చట్టం. దాని ఉద్దేశం ఏమిటంటే.. నీ జనరేషన్‌లో నువ్వు కూడా సంపాదించు.. దాన్ని నీ వారసులు, ప్రజలకు వదిలేసి వెళ్లు అని.. నువ్వు సంపాదించినదాంట్లో నుంచి కచ్చితంగా కొంతవరకు దేశంలోని అవసరం ఉన్న ప్రజలకు వదిలేయాలి.. సంపాదించింది మొత్తం కాదు.. ఇది చాలా చక్కని విధానం’ అని అభిప్రాయపడ్డారు.

కనీస వేతనాలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మనదేశంలో ప్రజలకు కనీస వేతనాలు దక్కటం లేదు. కనీస వేతనాలు కచ్చితంగా దక్కేలా కాంగ్రెస్ పార్టీ ఉత్తమమైన చట్టం చేయాలని భావిస్తున్నది. దానివల్ల పేదలకు, కార్మికులు, ఉద్యోగులకు ఎక్కువ డబ్బు వెళ్తుంది. సంపద పంపిణీ అంటే అది. నేడు ధనవంతులు వారివద్ద పనిచేస్తున్న గుమాస్తాలు, సేవకులు, పనిమనుషులకు సరైన వేతనాలు ఇవ్వటం లేదు. కానీ దుబాయ్, లండన్ వంటి ప్రదేశాలకు వెళ్లి ఆ డబ్బునే ఖర్చుపెడుతూ జల్సాలు చేస్తున్నారు’ అని విమర్శించారు. 

మీ ఆస్తులు మీ పిల్లలకు కూడా దక్కనివ్వరు

పిట్రోడా ‘వారసత్వ పన్ను’ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ వెంటనే అందుకొన్నారు ఛత్తీస్‌గఢ్‌లోని సర్గూజాలో బుధవారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర ఉద్దేశాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ రాజకుటుంబ యువరాజుకు సలహాదారుగా ఉన్న వ్యక్తి.. మధ్యతరగతి వర్గం మరింత పన్ను కట్టాల్సి ఉంటుందని గతంలో అన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. వారసత్వ పన్ను విధిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటున్నది.

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా స్వీకరించే ఆస్తులపై కూడా పన్ను వేస్తారట. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తులను కూడా మీ వారసులకు ఇవ్వలేరు. కాంగ్రెస్ హస్తం ఆ సంపదను దోచేస్తది. మీ జీవితకాల కష్టార్జితాన్ని దోచుకోవటం.. మీ మరణానంతరం కూడా దోచుకోవటమే కాంగ్రెస్ మంత్ర’ అని విమర్శించారు. ఎల్‌ఐసీ సంస్థ ట్యాగ్‌లైన్ అయిన ‘జిందగీకే సాత్ భీ.. జిందగీ కే బాద్ భీ’ (బ్రతికున్నంతకాలం.. మరణించిన తర్వాత కూడా) అనే వ్యాఖ్యాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘మీరు బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ విధించే అధిక పన్నులతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీరు మరణించిన తర్వాత కూడా వారసత్వ పన్నుతో మీపై భారం మోపుతుంది’ అని ప్రజలను హెచ్చరించారు.

పిట్రోడా వ్యాఖ్యలు వ్యక్తిగతం: కాంగ్రెస్

సామ్ పిట్రోడా వ్యాఖ్యలను బీజేపీ ప్రచారాస్త్రంగా మార్చుకోవటంతో కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. పిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నాతోపాటు ప్రపంచంలో ఎంతోమందికి పిట్రోడా మెంటార్, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్. భారతదేశ అభివృద్ధికి ఆయన ఎంతో కృషిచేశారు. ఆయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన బలంగా నమ్మే అంశాలు వేటిపైన అయినా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడిస్తారు. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉంటుంది. ఆయన అభిప్రాయాలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ అభిప్రాయాలుగా పరిగణించకూడదు.

పిట్రోడా వ్యాఖ్యలను సంచలనంగా మార్చటం ద్వారా అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారు. ప్రధాని వ్యాఖ్యలు కేవలం అబద్ధాలు.. పెద్దపెద్ద అబద్ధాలు’ అని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే ప్రధానికి నచ్చటం లేదని కాంగ్రెస్ మీడియా విభాగం ఇన్‌చార్జి పవన్ ఖేరా ఆరోపించారు. ‘మోదీ విధానాల వల్ల గత పదేండ్లలో అణచివేతకు గురైన వర్గాలు మరింత వెనక్కు నెట్టబడ్డాయి. భిన్నమైన ఆలోచనలపై ఈ పురాతనమైన భూమిపై చర్చించేందుకు అనుమతే లేదా?’ అని ప్రశ్నించారు.

‘కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఎన్నో ఏండ్లపాటు ఏలింది. కానీ ఎన్నడూ వారసత్వ పన్నును విధించలేదు. ఇప్పుడు మీరు అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రినటే విమర్శించారు. నిజానికి దేశంలో వారసత్వ పన్ను విధించాలనే ఆలోచన నరేంద్రమోదీదేనని ఆరోపించారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటంతో పిట్రోడా స్పందించారు. తన మాటలను ప్రధాని వక్రీకరించారని ఆరోపించారు.