06-08-2025 11:18:06 PM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్..
సూర్యాపేట (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ ఎంతో కీలక పాత్ర పోషించారని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(District Collector Tejas Nandalal Pawar) అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల సందర్బంగా బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబుతో కలిసి పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత దేశానికి 1947లో స్వతంత్రం వచ్చినప్పటికి తెలంగాణ నిజాం పాలనలో ఉందని తదుపరి అన్యాయాలను ఎదిరించేందుకు పోరాటాల ద్వారా, సాహిత్యం ద్వారా ప్రజలకి వారి హక్కులు తెలిసేలా చేశారన్నారు.
మన ప్రాంతానికి చెందిన వారికే ఉద్యోగాలు వస్తే ప్రాంతంతో పాటు, దేశం అభివృద్ధి చెందుతుందని భావించి ఉద్యోగాల కోసం ప్రజల తరుపున ఎంతగానో పోరాడాడన్నారు. వారిని స్ఫూర్తి గా తీసుకొని ప్రతి ఉద్యోగి బాధ్యతగా భావించి ప్రజలకు సేవ చేయాలన్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ శాఖల ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకొనిరావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డిఆర్డిఓ వి.వి. అప్పారావు, డిటిడిఓ శంకర్,పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటిండెంట్లు సాయి గౌడ్, సంతోష్ కిరణ్,శ్రీలత రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.