calender_icon.png 30 January, 2026 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మలుపులెన్నో!

13-01-2026 12:00:00 AM

అల్లర్లతో పశ్చిమాసియా దేశం ఇరాన్ అట్టుడికిపోతున్నది. ఆర్థిక సంక్షోభానికి తోడు ఖమేనీ నియంత పాలన ను వ్యతిరేకిస్తూ ఆ దేశ ప్రజలు చేపట్టిన నిరసనలు తారా స్థాయికి చేరుకున్నాయి. కరెన్సీ పతనం, ధరలు ఆకాశాన్నంటడం, ఖమేనీ నియంత పాలన ఇరాన్ ప్రజలకు విసుగు తెప్పించాయి. దీంతో ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ గతేడాది డిసెంబర్ 28న దేశ ప్రజలంతా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ప్రధాన నగరాల వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. అప్పటినుంచి సాగుతున్న నిరసనల్లో మరణించిన వారి సంఖ్య 544కు చేరుకోగా, 10 వేల మందికి పైగా నిరసనకారులను అక్రమంగా అరెస్ట్ చేశారు.

ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఫొటోలను తగులబెట్టి, ఆ మంటల్లో ఇరాన్ మహిళలు సిగరెట్లు వెలిగించిన దృశ్యాలు చూస్తే దేశ ప్రజల్లో ఖమేనీ పాలనపై వ్యతిరేకత ఎంత ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఘర్షణల్లో ఆందోళనకారుల్ని అణచివేస్తున్న ఇరాన్ ప్రభుత్వంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘర్షణల్లో నిరసనకారులకు ఏమైనా జరిగితే సైనిక చర్యతో బదులిస్తామని ట్రంప్ హెచ్చరిస్తూనే వచ్చారు. అయితే తాజాగా సోమవారం తాము చర్చలకు సిద్ధమంటూ ఇరాన్ ప్రభుత్వం ఒక మెట్టు దిగిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే వారు చర్చలకు వచ్చినప్పటికీ, సమస్య పరిష్కారం కోసం అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తామని ట్రంప్ చెప్పారు.

ఇరాన్ నాయకులతో సమావేశం ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదన్నారు. మరో వైపు ఇరాన్‌లో ప్రజల నిరసనలను ప్రోత్సహిస్తున్న ఆ దేశ బహిష్కృత యువరాజు రేజా పహ్లావితో ట్రంప్ భేటీ కానుండడం ఆసక్తిని సంతరించుకుంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్‌గా కొనసాగుతున్న అయతొల్లా ఖమేనీని గద్దె దించేందుకు అమెరికా గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం తగదని సున్నితంగా హెచ్చరించింది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ సైతం ఇరాన్‌లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని, ఇతర దేశాలకు చెప్పే ముందు ట్రంప్ తన సొంత దేశంపై దృష్టి పెడితే బాగుంటుందని తెలిపారు. ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు తమ ప్రజలు సొంత దేశాన్ని నాశనం చేస్తున్నారని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

దీంతో మరింత రెచ్చిపోయిన నిరసనకారులు ఖమేనీ ఫొటోలు తగలబెట్టడంతో పాటు రెజా పహ్లావి తిరిగి రావాలని, ఇరాన్‌ను పాలించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏ దేశంలోనైనా ఆర్థిక సంక్షోభం, సామాజిక అణచివేత తీవ్ర స్థాయికి చేరినప్పుడు ఉద్యమాలు ఊపందుకున్న మాట నిజమే. ప్రస్తుతం ఇరాన్ అదే స్థితిలో క్టొటుమిట్టాడుతున్నది. ఇరాన్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో నిరసనలను ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, దేశ ప్రజల్లో రగులుతున్న అసంతృప్తిని ఆపడం కొంచెం కష్టమే. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత కఠిన పరీక్షను ఖమేనీ సహా ఇరాన్ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అమెరికా రంగంలోకి దిగడంతో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మరి ఇరాన్ ప్రభుత్వం చర్చల తో సమస్యను పరిష్కరించుకుంటుందా లేక యుద్ధం అనివార్యమవుతుందా అన్నది వేచి చూడాలి.