06-11-2025 11:14:33 PM
పరుగులు తీసిన గర్భిణీలు, ఇతర రోగులు, వైద్య సిబ్బంది..
తప్పిన పెను ప్రమాదం..
పెద్దకొత్తపల్లి ఆరోగ్య కేంద్రంలో ఘటన..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పెను ప్రమాదం తప్పింది. శిథిలావస్థలోకి దగ్గరగా ఉన్న ఆరోగ్య కేంద్రం పైకప్పు ఊడి పడింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. రోగులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రి పైకప్పు ఊరుస్తోంది. అదే వార్డులో ఓపి ఇన్ పేషెంట్లు కూడా చికిత్స పొందుతున్నారు.
గురువారం సాయంత్రం ఒక గర్భిణీ స్త్రీ ఐరన్ గ్లూకోజ్ ఎక్కించుకున్న అనంతరం అప్పుడే మందులు తీసుకునేందుకు బయటకు వస్తుండగా ఒకసారిగా భారీ శబ్దలతో కూడిన పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా రోగులతో పాటు చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీ భయంతో పరుగులు తీశారు. వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది సైతం తలోదారి గుండా బయటికి పరుగులు తీశారు. చాలాకాలంగా ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందని ఉన్నతాధికారులకు సైతం తెలిసినప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.