వైశాఖీ పండుగకు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత: డాక్టర్ కోట నీలిమ
సనత్‌నగర్,(విజయక్రాంతి): వైశాఖీ భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ అని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. అమీర్‌పేట్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ప్లే గ్రౌండ్స్ లో నిర్వహించిన వైశాఖీ వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. ఈ క్రమంలో సిక్కు మత పెద్దలు, గురుద్వారా ప్రబంధక్ కమిటీ నాయకులు డాక్టర్ కోట నీలిమకు వారి సిక్కు మత సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం కోట నీలిమ వారితో కలసి ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైశాఖీ పండుగ భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ అని పేర్కొన్నారు.
ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో ఇది కొత్త పంట పండుగగా జరుపుకుంటారని, రైతుల కష్టానికి ఫలితం దక్కే సంతోషకరమైన సందర్భమని తెలిపారు. వైశాఖీ పండుగ సిక్కు సంప్రదాయంలో కూడా ప్రత్యేక స్థానం కలిగి ఉందని, 1699లో ఖాల్సా పంథ్ స్థాపనకు, ఈ రోజుకు చారిత్రక ప్రాధాన్యం ఉందని గుర్తుచేశారు. మన దేశంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ, ఇలాంటి పండుగలు మనందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తాయని, ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ వైశాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిక్కు సోదరసోదరీమణులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో సిక్కు మత గురువులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






