calender_icon.png 17 November, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ కేరాఫ్ పబ్స్

23-07-2024 12:05:00 AM

  • పలువురికి పరీక్షలు, డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ 
  • పోలీసుల అదుపులో 11 మంది

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (విజయక్రాంతి): తెలంగాణను డ్రగ్స్ ఫ్రీగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మత్తు పదార్థాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. యువత డ్రగ్స్ బారినపడకుండా, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నార్కోటిక్ బ్యూరో, పోలీసులు విస్తృత దాడులు  నిర్వహిస్తున్నారు. అయినా పలువురి తీరు మారడం లేదు. నగరంలోని పలు పబ్‌లు డ్రగ్స్‌కు కేరాఫ్‌గా మారాయి. దీంతో కొన్ని రోజులుగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నార్కోటిక్ బ్యూరో, పోలీసులు ఆకస్మిక దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి, డ్రగ్స్, ఇతర మాద క ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆగస్టు నెలాఖరుకు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీగా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభు త్వం సంబంధిత శాఖలతో దాడులను ముమ్మరం చేసింది. 

జోరా, ఆలివ్ బిస్ట్రో పబ్‌ల్లో దాడులు

నగరంలోని జోరా, ఆలివ్ బిస్ట్రో పబ్‌ల్లో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. జోరా పబ్‌లో నార్కో టిక్, జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. పబ్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. అందులో నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దుర్గంచెరువు సమీపంలోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టారు. పలువురికి పరీక్షలు నిర్వహించగా, ఏడుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా నగరంలో పోలీసులు దాడులు నిర్వహిస్తున్న సందర్భంగా పబ్‌ల్లో డ్రగ్స్ దొరకడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఖాజాగూడలోని ఓ పబ్‌లో పలువురు డ్రగ్స్ వినియోగిస్తున్నారని వచ్చిన సమాచారంతో రాయదుర్గం పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏకంగా 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి పరీక్షలు నిర్వహించగా 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. 

తీరు మారట్లేదు

రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నార్కోటిక్ బ్యూరో, పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా పలువురి తీరు మారడం లేదు. నగరంలో ప్రతి రోజు ఎక్కడో ఒకచోట డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. నగరంలోని జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ సహా పలు పబ్బుల్లో నిర్వాహకులు రోజువారీగా ఏదో ఒక ఈవెంట్ జరుపుతున్నారు. ఇటీవల పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో పలువురు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నిర్ధారణ అవుతోంది. డ్రగ్స్ నియంత్రణపై నిఘా ఉంచిన ప్రభుత్వం వాటిని పూర్తిగా నివారించాలని ప్రజలు కోరుతున్నారు. 

డ్రగ్స్ ముఠా అరెస్టు

ఎల్బీనగర్, జూలై 22: రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశా రు. సోమవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషరేట్ కార్యాలయం లో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన ఓంరామ్, సన్వాలారామ్ అనే ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందిన వికాస్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించడానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు జవహర్‌నగర్, ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు ఈ నెల 21న దాడులు నిర్వహించి మల్కాపురం గ్రామ శివారులో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.45 లక్షల విలువైన డ్రగ్స్ (గసగసాల గడ్డి), 10 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మూడు సెల్‌ఫోన్లు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నింది తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. మరో నిందితుడు వికాస్ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.