calender_icon.png 16 July, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ హయాంలో 6.47లక్షల రేషన్ కార్డులిచ్చాం

16-07-2025 12:00:00 AM

  1. వాదన తప్పని నిరూపిస్తే చెంప దెబ్బలకు సిద్ధం 
  2. కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ 

హైదరాబాద్, జులై 15 (విజయక్రాంతి): కేసీఆర్ హయాంలో 6.47లక్షల రేషన్ కార్డులను పంచామని.. తన వాదన తప్పని నిరూపిస్తే చెంప దెబ్బలకు సిద్ధమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని యేండ్లు అవుతున్నా రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూడటం ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ వైఫల్యం వల్ల కాదా అని ప్రశ్నించారు.

జూలై 2021లో ప్రతి పక్ష నేతగా భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంచినట్టు అప్పట్లో ట్వీట్ చేశారని, ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీగా బీఆర్‌ఎస్‌లో ఉన్నపుడు రేషన్ కార్డుల పంపిణీ గురించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని గుర్తుచేశారు. చౌటుప్పల్‌లో అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షంలో తాను రేషన్ కార్డులు పంచినట్టు జగదీశ్ రెడ్డి తెలిపారు.

గతంలో కేసీఆర్ జిల్లా పర్యటనలకు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు ప్రకటించే వారని, సీఎం తుంగతుర్తి సభలో తిట్లు తప్ప ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో మాది నీళ్ల కోసం ఆరాటమైతే, ఇప్పుడు కమీషన్ల కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటమని విమర్శించారు.

కార్యక్రమం ఏది అని చూడకుండా రేవంత్ అన్ని పాత్రలు తానే వేస్తున్నారని, రేవంత్ చర్యలు వీధి బాగోతాలను మించిపోయాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు మూడు రోజులు టైమ్ ఇస్తే కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేసి చూపిస్తామన్నారు.  ‘నేను సోడా కలిపానో.. నీళ్లు కలిపానో పక్కన బెట్టు.. మీ లాగా గురు దక్షిణ కింద కృష్ణా, గోదావరి జలాలను కిందకు తరలించలేదు’ అని జగదీశ్ రెడ్డి చురకలంటిచారు.