calender_icon.png 10 November, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ ధర్నా

10-11-2025 08:07:51 PM

హనుమకొండ (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలను ఇవ్వాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ జిల్లా గ్రంథాలయం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. 

ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ దేశంలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు యువతకు ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు దక్కించుకునే ఎత్తుగడలేనని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికిన బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పుతుందని, ఉద్యోగాలు లేకుండా చేస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లతోనే ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకుందని, ఉద్యోగాలు ఇచ్చేంతవరకు నిరుద్యోగ భృతి నెలకు ₹4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు దాటినా యువతకు ఎటువంటి ఉపశమనం కలగలేదని, నియామక ప్రక్రియలు నత్తనడకన సాగుతున్నాయని, నిరుద్యోగులు నిరీక్షణతో విసిగిపోతున్నారని, ఇటీవల ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం కూడా మరో నిరాశగా మిగిలిందని అన్నారు.

జాబ్ మేళాలు నిర్వహించి ప్రైవేటు జాబ్ లు ఇచ్చి ప్రచారం చేసుకోవడం తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల సమయంలో ప్రతి యువతి కి చేతికి ఒక స్కూటీ ఇస్తామని చెప్పిన హామీ కూడా మరచిపోయారని విమర్శించారు. నిరుద్యోగ యువతపై నిర్లక్ష్యం వీడి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తామని రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ  జిల్లా సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, నాయకులు భోగి నరేష్, కేయూ రీసర్చ్ స్కాలర్స్ కేతపాక ప్రసాద్, జనగాం రాజారాం, నాయకులు దూడపాక అశోక్,యం.చంద్ర, నిరుద్యోగ సంఘ నాయకులు శ్యామ్, ప్రభాకర్, కామేష్, ప్రశాంత్, రమేష్ ,నవీన్, తిరుపతి, నరేష్, రాకేష్, వంశి, అనిల్, అఫ్జల్, రాజు, అనిత, స్వప్న, స్రవంతి, శ్వేతా, సంధ్య లు పాల్గొన్నారు.