10-11-2025 09:04:57 PM
గజ్వేల్: కేవలం 500 రూపాయలతో రూ.10 లక్షల ప్రమాద బీమా పొందవచ్చని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ ఎస్బిఐ ఎడిబి బ్రాంచ్ మేనేజర్ డివి రఘు కృష్ణ అన్నారు. రూ. 500 రూపాయలు వార్షిక ప్రీమియం చెల్లించిన దౌల్తాబాద్ గ్రామానికి చెందిన జె.నరేందర్ ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు. ఇటీవల విద్యుత్ షాక్ తో నరేందర్ మృతిచెందాడు. సోమవారం గజ్వేల్ ఎస్బిఐ ఏసీబీ బ్రాంచ్ మేనేజర్ డీవీ. రఘు కృష్ణ మృతుని కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ప్రమాద బీమాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలు అగమ్య గోచర పరిస్థితుల్లో కూరుకుపోతారని, ప్రమాదాల బారిన పడి మృతిచెందే వారి కుటుంబాలకు ప్రమాద బీమా అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.