బీజేపీకి ఈసీ జేబు సంస్థ
ఏం మాట్లాడినా మోదీకి నోటీసులు ఇవ్వరు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): బీజేపీకి ఎన్నికల సంఘం జేబు సంస్థగా పని చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈసీ నోటీసులు ఎందుకివ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. మీడియాతో మంగళవారం మాట్లాడుతూ... “హిందు మహిళల తాలిబొట్లు తెంచి ముస్లింలకు ఇస్తారని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడటం దారుణం.
కాంగ్రెస్‌పై చేసిన విమర్శలకు ఒక్క ఆధారమైన ఉందా? రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తా? మోదీకి అబద్ధాలు చెప్పి ట్రైనింగ్ ఇస్తున్న ప్రొఫెసర్ ఎవరు? క్రిమినల్ మైండ్‌తో పవర్ కోసం దిగజారుడు అవసరమా? ఈసీ ఏంచేస్తోంది. మోదీకి నోటీసులు ఎందుకు ఇవ్వరు? ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కు వచ్చి నోటీసులు ఇచ్చారు. ఈసీని బీజేపీ ఇంటి నౌకర్‌గా భావిస్తోంది. ఇది మంచి పద్దతి కాదు” అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో మోదీ రాష్ట్రానికి వస్తున్నందునే నిరసన చెప్పడం లేదని, లేదంటే అడ్డుకునే వాళ్లమని చెప్పారు.
రాహుల్ ప్రధాని అయితే..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని 14 సీట్లలో గెలిపించి రాహుల్‌గాంధీ ప్రధాని కావడానికి సహకరించాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాహుల్ ప్రధాని అయితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు. గుర్తింపు లేని కులాలకు కూడా గుర్తింపు ఇవ్వాలని రాహుల్‌గాంధీ నిర్ణ యం తీసుకున్నారని తెలిపారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు నిర్ణయించుకోవడంతో మోదీకి భయం వేస్తోందని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌భగవత్ కూడా ఎస్సీ, ఎస్టీలకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం కాదని చెప్పుకునే పరిస్థితికి రాహుల్‌గాంధీ తెచ్చారన్నారు. అమిత్‌షా ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపాడంటేనే బీజేపీలో దడ పుట్టిందనే విషయం స్పష్టమవుతోందన్నారు.
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా అని అన్నారు. రోజు మీడియాలో కనిపించాలనే సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు కలుస్తాయని చెప్ప డం హాస్యాస్పదంగా ఉందని, ఆ రెండు పార్టీలు పుట్టుకతోనే శత్రువులుగా ఉన్నాయన్నారు. కేసీఆర్ మాటలకు విలువలేదని, సీఎంగా ఉన్నప్పుడు ఓయూ, కాకతీయ యూనివర్సిటీలను ఎప్పుడైనా సందర్శించారా? అని ఆయన నిలదీశారు. ఇప్పుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.




