15-05-2025 02:11:00 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
తిమ్మాపూర్, మే14(విజయక్రాంతి):ప్రభుత్వం అందజేస్తున్న శిక్షణలు, పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ ఎల్‌ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో 20 మంది మహిళలకు ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ లో గత నెల 12 నుండి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారథ లక్ష్యంగా, వారు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో విభిన్నంగా ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఈ ఆటోలను పైసా ఖర్చు లేకుండా నడుపుకోవచ్చని, తద్వారా రోజు వారి ఆదాయం సంపాదించవచ్చని అన్నారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను ఆటోల్లో తీసుకెళ్లడం ద్వారా మహిళలు నికర ఆదాయం పొందవచ్చని సూచించారు.
శిక్షణ విజయవంతంగా పూర్తి అయిన తర్వాత మహిళలు ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణ సదుపాయం కల్పించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బృందాలకు ఎలక్ట్రికల్ ఆటో రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్ గా మహిళలు రాణిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలవాలని, డ్రైవింగ్ రంగంలోకి మరింత మంది మహిళలను ఆకర్షించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవింగ్ రంగంలో రాణిస్తున్న మహిళలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళ డ్రైవర్లు ఆటో నడుపుతుండగా జిల్లా కలెక్టర్ ప్రయాణించారు. మహిళా ఆటో డ్రైవర్ల శిక్షణకు సహకరించిన బజాజ్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ సుధారాణి, రాజ కిషన్ రెడ్డి, బజాజ్ కంపెనీ మేనేజర్లు అనిల్ కుమార్, నాగరాజు పాల్గొన్నారు.