calender_icon.png 31 July, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నింగిలోకి నైసార్

31-07-2025 12:52:13 AM

గఘనం!

  1. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 16 ప్రయోగం విజయవంతం
  2. నాసా-ఇస్రో చేపట్టిన తొలి ఉపగ్రహ ప్రయోగం ఇదే
  3. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగానూ ఘనత
  4. అంతరిక్షరంగంలో భారత్ కీలక ముందడుగు

న్యూఢిల్లీ, జూలై 30: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్తంగా చేపట్టిన నైసార్ (నాసా, ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్) భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. 2,393 కిలోల బరువున్న నైసార్‌ను జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జీఎస్‌ఎల్‌వీ బయలుదేరిన 18:59 నిమిషాలకు భూమి నుంచి 747 కిలోమీటర్ల ఎత్తులో విడిపోనుంది.

ఏపీ, తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం సాయంత్రం 5:42 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. ఇస్రో-నాసా కలిసి ప్రయోగించిన తొలి ఉపగ్రహంతో పాటు, అత్యంత ఖరీదైన ఉపగ్రహంగానూ నైసార్ నిలిచింది. దీంతో అంతరిక్ష రంగంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం నాసా 1.16 బిలియన్ డాలర్లు వెచ్చించగా, భారత్ 90 మిలియన్ డాలర్లు సమకూర్చింది.

ఇప్పటివరకు నింగిలోకి చేర్చిన అత్యంత శక్తిమంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో నైసార్ ఒకటిగా నిలిచింది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ), నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) సంయుక్తంగా రూపొందించడం వల్ల నైసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్) అని పేరు పెట్టారు. రెండు సింథటిక్ అపర్చర్ రాడార్లు (సార్) అమర్చిన తొలి ఉపగ్రహం నైసార్ కావడం విశేషం.

ఈ ప్రాజెక్ట్‌ను భారత్ అంతరిక్ష సహకారంలో తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే యాక్సిమ్ మిషన్ కింద భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది. తాజాగా నైసార్ ప్రయోగాన్ని సంయుక్తంగా చేపట్టాయి. నైసార్ భవిష్యత్తులో ఇచ్చే ఆధారంగా పంటలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, హరికేన్లను అంచనా వేసి.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావొచ్చు.

నైసార్ రాడర్లు ప్రతి 12 రోజులకు రెండుసార్లు భూమి మొత్తాన్ని స్కాన్ చేయడంతో పాటు, మంచుతో కప్పబడిన ఉపరితలాలను 242 కిలోమీటర్ల వెడల్పుతో అధిక రిజల్యూషన్‌తో చిత్రాలను స్కాన్ చేయనుంది. దీనికోసం మొదటిసారి స్వీప్‌సార్ టెక్నాలజీ ఉపయోగించనున్నారు.

నైసార్ ప్రత్యేకతలు

* నైసార్‌లోని రెండు రాడార్లు భారీ డిష్ ఆకారంలో ఉంటాయి. ఇవి భూమి పైకి మైక్రోవేవ్, రేడియో సంకేతాలు పంపి.. తిరిగివచ్చిన వాటిని విశ్లేషించే చిత్రాలను రూపొందిస్తాయి. ఈ యాంటీన్నా 12 చదరపు మీటర్ల వైశాల్యంతో ఉంటుంది. దీన్ని మడతబెట్టి అంతరిక్షంలోకి పంపుతారు. ఇది భూమిపై దాదాపు  20 కి.మీ. వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రించగలదు.

* నైసార్‌కు ఉన్న రెండు రాడార్లలో ఒకటి ఎల్-బ్యండ్ ఫ్రీక్వెన్సీ, మరొకటి ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీల్లో పనిచేస్తాయి. ఈ రాడార్లు పగలు, రాత్రి తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులో స్పష్టంగా ఫొటోలను ఇవ్వగలవు, ఒకే ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేర్వేరుగా చిత్రాలను తీసే అవకాశం ఉంటుంది. ఏకకాలంలో వందలాది అగ్నిపర్వతాల్లో సంభవించే మార్పులను గమనించే సామర్థ్యం వీటి సొంతం.

* ఎల్-బ్యాండ్ రాడార్ ఫ్రీక్వెన్సీలు మైక్రోవేవ్ తరంగాలు ఎక్కువ వేవ్‌లెంగ్త్‌తో ప్రసరిస్తాయి. అరణ్యాలు, ఎడారులు, మంచు ఖండాల్లో భూమిని చిత్రీకరిస్తాయి.

* ఎస్-బ్యాండ్ రాడార్‌లో తక్కువ వేవ్‌లెంగ్త్‌తో తరంగాలు ప్రసరిస్తాయి. ఇవి పంట పొలాలు, నీటి వనరులు వంటి వాటిని చిత్రీకరిస్తాయి.

* నైసార్ ఉపగ్రహం రోజుకు 80 టీబీ డేటాను సృష్టిస్తుంది. గతంలో ఇస్రో, నాసా ఏజెన్సీలు ప్రయోగించిన ఏ ఎర్త్ శాటిలైట్లూ ఇంతటి డేటాను అందించలేదు.

సీఎం రేవంత్ అభినందనలు

శ్రీహరికోట నుంచి నైసార్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన జీఎస్ ఎల్వీ-ఎఫ్ ప్ర యోగం విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలను సీఎం అభినందించారు. ఈ విజయం భారత అంతరిక్ష పరిశోధన ప్రయాణం లో కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు. అమెరికాకు చెందిన నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) సహకారంతో చేపట్టిన ఈ మిషన్ విజయం అంతరిక్ష పరిధోన చరిత్రలో మహత్తరమైన ఘట్టమని వ్యాఖ్యానించారు.