31-07-2025 12:48:09 AM
8 చోట్ల ఏకకాలంలో సోదాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో దాదాపు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలు వెలువడగా, బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్‌తో సహా రాష్ర్టవ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కుంభ కోణం వెలికితీతలో భాగంగా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పశుసంవర్ధకశాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాజీ ఓఎస్‌డీ కల్యాణ్‌కుమార్‌ను ఈడీ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని కల్యాణ్ ఇంట్లో సుమారు ఏడుగంటల పాటు తనిఖీలు నిర్వహించిన ఈడీ, అనంతరం ఆయన్ని ప్రశ్నించి అరెస్టు చేసినట్లు సమాచారం.
ఉదయం నుంచి సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, జూబ్లీహిల్స్, దిల్‌సుఖ్‌నగర్, అత్తాపూర్ ప్రాంతాలతో పాటు రాష్ర్టవ్యాప్తంగా మొత్తం ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రాంచందర్ నాయక్ నివాసం, మాజీమంత్రి ఓఎస్‌డీ కల్యాణ్ కుమార్, పరారీలో ఉన్న మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ నివాసాలు ప్రధానంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలమంది లబ్ధిదారులకు సుమారు రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ గొర్రెల స్కాం కేసులో ఏసీబీ ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించింది. అరెస్టయిన వారిలో రాష్ర్ట గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండీ రాంచందర్‌నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేయడంతో.. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపి పెద్దల పాత్రను బయటపెట్టే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
ఏంటీ గొర్రెల పథకం కుంభకోణం..
తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 20న గొర్రెల పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా యాదవ సంఘాల్లోని సభ్యులకు గొర్రెలను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందించేది. ఒక్కో యూనిట్‌లో 21 గొర్రెలు ఉంటాయి. ఒక్కో యూనిట్‌కు ప్రభుత్వం రూ.1.25లక్షల చెల్లించేది.
ఆ తర్వాత దీన్ని రూ.1.75లక్షలకు పెంచారు. గ్రామసభల్లో ఎంపిక చేసిన లబ్ధిదారులకు గొర్రెలు అందించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా కొనుగోలు చేశారు. మొదట్లో అధికారులు నిబంధనల ప్రకారమే నడుచుకున్నారు. తర్వాత ఇతర రాష్ట్రాల్లోని దళారులతో అధికారులు కుమ్మక్కై గొర్రెలు రీసైక్లింగ్ వంటి కుంభకోణానికి తెరతీశారు.
బయటపడిందిలా..
గొర్రెల పథకంలో భాగంగా గొర్రెలను విక్రయించిన వారికి కాకుండా దళారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వల్ల విషయం బయటపడింది. ఏపీలోని ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన 18మంది గొర్రెల పెంపకందారులు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో జనవరి 26, 2024లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నమోదు కావడానికి ముందే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కీలక ఫైళ్లు మాయం చేశారని ఆ శాఖ అధికారులు అప్పట్లో నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
ఈసమయంలోనే రంగారెడ్డి జిల్లాలో ఈ స్కీంలో అవకతవకలు జరిగాయనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈస్కాంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల పథకంలో మనీలాండరింగ్ జరిగిందని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసును విచారించాలని ఈడీని ఏసీబీ కోరింది. దీంతో ఈ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ ప్రారంభించారు.
కాగ్ నివేదిక సైతం..
కాగ్ నివేదిక సైతం గొర్రెల పథకంలో అవకతవకలు జరిగినట్లు పేర్కొంది. వీటిలో లబ్ధిదారుల వివరాలను సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులకు సంబంధించిన రికార్డులు సరిగ్గా లేకపోవడం, గొర్రెల యూనిట్లకు సంబంధించి నకిలీ ట్యాగ్‌లు ఉండటంతో అవినీతి జరిగినట్లు వెల్లడించింది.
కాగ్ నివేదిక ప్రకారం తెలంగాణలోని 33 జిల్లాలకు గాను కేవలం 7 జిల్లాల్లోని వివరాల ప్రకారమే ప్రభుత్వానికి రూ.253.93 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ విచారణలో తేలింది. అయితే 33 జిల్లాలకు చూసుకుంటే అవినీతి భారీగా ఉండే అవకాశం ఉందని ఈడీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.