31-07-2025 12:58:16 AM
మాస్కో/టోక్యో/న్యూయార్క్, జూలై 30: రష్యా తీరప్రాంతం కమ్చట్కా ద్వీపకల్పంలో మంగళవారం సంభవించిన భూకంపం ప్రపంచాన్ని వణికించింది. కమ్చాట్కా ద్వీపకల్పంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.8 గా నమోదైంది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడిం చింది. భూకంపం కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యా యి.
రష్యాలోని పెట్రోపావ్లోవ్స్-కమ్చట్కా నగరానికి తూర్పు ఆగ్నేయంగా 136 కిలోమీటర్ల దూరంలో.. 18 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. ఈ ఘటనతో ప్రజలు ఆం దోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు . భూకంప తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున సునా మీ అలలు రావడం గమనార్హం.
ఈ భూకం పం తర్వాత జపాన్‌లోని హొక్కైడో ఉత్తర తీరంలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చినట్టు జపాన్ మీడియా తెలిపింది. ఆ తర్వాత 4.3 అడుగుల ఎత్తులో వచ్చాయని పేర్కొం ది. సునామీ అలల వల్ల భారీ నష్టం కలిగే అవకాశం ఉండటంతో ఇప్పటికే తీర ప్రాం తాలు, నదీ తీరాల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసి వేరే చోటికి తరలించినట్టు జపాన్ అధికారులు తెలిపారు.
పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (పీటీడబ్ల్యూసీ) సునామీ అలలు ఇప్పటికే తీరప్రాం తాలను తాకడం ప్రారంభించాయని నిర్థారించింది. అమెరికాలోని హవాయి ఓహు ఉత్తర తీరంలోని హలైవాలో సునామీ అల 4 అడుగుల ఎత్తుతో ఎగసిపడింది. అంతేకాదు అలలు దాదాపు 12 నిమిషాల వ్యవధిలో పలుమార్లు వచ్చినట్టు తెలిపింది.
ఇక ఉత్తర కాలిఫోర్నియాలోని తీర ప్రాంతమైన సాన్ డీగోను సునామీ అలలు తాకాయి. ఆ తర్వాత వరుసగా ఫోర్ట్ బ్రాగ్, క్రిసెంట్ సిటీ, మాంటెరీ, సాన్ ఫ్రాన్సిస్కో, సంటా బార్బరా, లాస్ ఏంజిల్స్ హార్బర్, న్యూ పోర్ట్ బీచ్‌ను సునామీ అలలు తాకినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పసిఫిక్ మహాసముద్రం గుండా ఉన్న 12 దేశాల తీర ప్రాంతాలపై సునామీ ప్రభావం పడనుంది.
కమ్చట్కాను కుదిపేసిన భూకంపం
భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్ నగరంలో పలు భవనాలు కంపించాయని రష్యా మీడియా పేర్కొంది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్టు పేర్కొంది. కమ్చట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్‌ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్టు వివరించింది. అత్యవసర సేవల కోసం ఒక టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేశారు. రష్యాలోని సెవెరో తీర పట్టణాన్ని సముద్ర జలాలు ముంచెత్తిన దృశ్యాలు కనిపించాయి. ఈ పట్టణం కమ్చట్కా ద్వీపకల్పం సమీపంలో ఉంది.
హవాయి తీర ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్
అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల వరకు ఎగసిపడడంతో రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు ఒక్కసారిగా రోడ్ల మీదకు రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కార్లతో బారులు తీరాయి. అలాస్కాలోని అలూటియన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు సహా ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
జపాన్‌లో తీర ప్రాంతాలు ఖాళీ
జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో దేశంలోని తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. దాదాపు 2 మిలియన్ల మంది ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా వేరే ప్రాంతాలకు తరలించారు. ఉత్తర జపాన్‌లో ఉన్న ఇషినోమాని తీరం, చిబా ఫ్రావిన్సులని కుజుకురి బీచ్‌లో సునామీ అలలు ఎగసిపడుతున్నాయి. చీబాలోని తతయేమా తీరానికి సునామీ అలల ధాటికి నాలుగు తిమింగళాలు కొట్టుకొచ్చిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
సునామీ హెచ్చరికలతో జపాన్‌లోని ఫుకుషిమా అణు కేంద్రాన్ని ముందస్తు ఖాళీ చేస్తున్నారు. అందులో పని చేస్తున్న వర్కర్లను వేరే చోటికి తరలించారు. 2011లో వచ్చిన సునామీతో ఒక అణుకేంద్రం దెబ్బతిన్న విషయం తెలిసిందే. సునామీ హెచ్చరికలతో తీర ప్రాంతాల్లోని ఓడ రేవులు, విమానాశ్రయాలు మూసివేశారు.
ఫిలిప్పీన్స్‌లో పరిస్థితులు అదుపులోనే
పసిఫిక్ తీరంలో 3 అడుగుల కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఇవి పెద్ద అలలు కాకపోయినప్పటికీ తీర ప్రాంతంలోకి చొచ్చుకొచ్చి గంటల తరబడి అలానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
న్యూజిలాండ్, చైనాలకు కూడా ముప్పు
న్యూజిలాండ్ తీరంలో బలమైన, అసాధారణ ప్రవాహాలు, అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. సునామీ ప్రభావం చైనాపై కూడా ఉండనుంది. షాంఘై తీరంలోని 28 వేల మంది ప్రజలను ముందస్తుగా తరలించారు. విమానాలు, బోటు సర్వీసులు నిలిపేశారు.
భారత్‌కు ఎలాంటి ముప్పు లేదు
రష్యా తీరం కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించిన భారీ భూకంపంతో అమెరికా, జపాన్ సహా పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ నేషన ల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్)’ స్పందించింది. భారత్‌కు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసింది. హిందూ మ హాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. ఈ భూకంపం వల్ల భారత్‌తో పాటు హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని ఇన్‌కాయిస్ తెలిపింది.
సునామీ ముప్పు దేశాలు ఇవే..
రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంప ప్రభావం వల్ల రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. అనేక ప్రాంతాల్లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అయితే వీటితో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉందంటూ అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ జాబితాను విడుదల చేసింది.
* ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవుల్లో 3 మీటర్ల కంటే ఎత్తయిన అలలు ఎగసిపడే అవకాశం ఉంది.
* చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్‌స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరూ, సమోవా, సోలోమన్ దీవుల్లో 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి.
* 0.3 మీటర్ నుంచి ఒక మీటరు ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్న జాబితాలో అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు, ఎల్ సాల్వడార్, ఫీజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, పపువా న్యూగినీ, ఫిలిప్పీన్స్, తైవాన్ తదితర దేశాలున్నాయి.
* 0.3 మీటర్ల కంటే ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో చైనా, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, బ్రూనై, మలేసి యా, వియత్నాం దేశాలున్నాయి.
భూకంపం వణికించినా సర్జరీ పూర్తి చేశారు
రష్యా తీరంలోని భారీ భూకంపం కామ్చాట్కా ద్వీపకల్పాన్ని అతలాకుతలం చేసింది. బలమైన ప్రకంపనలు ఆ ప్రాంతాన్ని కుదిపేశాయి. భవనాలు సైతం ఊగిపోయాయి. శక్తిమంతమైన భూప్రకంపనలు సంభవించిన సమయంలో కామ్చాట్కా ప్రాంతంలోని ఓ ఆస్పత్రి దృశ్యాలను రష్యన్ న్యూస్ నెట్‌వర్క్ ఆర్టీ షేర్ చేసింది. ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ జరుగుతుతున్న సమయంలో భూకంపం వచ్చింది.
ప్రకంపనల ధాటికి ఆ బిల్డింగ్ మొత్తం ఊగిపోయినా.. వైద్యులు ఏ మాత్రం భయపడకుండా ప్రశాంతంగా సర్జరీని పూర్తి చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మా రాయి. వైద్యుల నిబద్ధతను మెచ్చుకుం టూ పలువురు కామెంట్లు పెట్టారు. సర్జ రీ విజయవంతమైందని.. రోగి కోలుకుంటున్నట్టు రష్యన్ ఆరోగ్య శాఖ ప్ర కటించిందని ఆర్టీ చానల్ వెల్లడించింది.