04-01-2026 04:27:16 PM
విజయక్రాంతి,పాపన్నపేట: వనదుర్గమ్మ వనంలో(Edupayala Vana Durga Bhavani Temple) ఎటు చూసినా జనమే జనం.. అందరిలో భక్తి భావం.. ఆధ్యాత్మిక వాతావరణం.. ప్రతి నోట వనదుర్గమ్మ నామస్మరణ.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రం ఆదివారం భక్తులతో జనసంద్రమైంది. వారాంతపు సెలవు రోజు కావడంతో ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయ అర్చకులు వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి భక్తులకు వనదుర్గమ్మ దర్శనం కల్పించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాలు, జంట నగరాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మ దర్శనానికి తరలివచ్చారు. చెక్ డ్యామ్, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీరా నదీ పాయలో పుణ్యస్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. అమ్మ దర్శనంతో భక్తులు తన్మయత్వం చెందారు. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుల్ల మధ్య బోనాలు, ఓడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వనదుర్గమ్మ తల్లి.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు.