calender_icon.png 23 August, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలి

23-08-2025 06:16:15 PM

జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రతి గర్భిణీ స్త్రీ తన గర్భస్థ శిశువు ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్(District Medical Officer Dr. Ravi Rathod) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా అంగన్వాడీ టీచర్లకు స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలకు, శిశువులకు హెచ్ఐవి, సిఫిలిస్ సోకకుండా ఉండాలంటే గర్భము దాల్చగానే ఒకసారి, 7 నుంచి 8 నెలల గర్భ కాలములో మరొకసారి తప్పకుండా హెచ్ఐవి సిఫిలిస్ పరీక్షలు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించాలని సూచించారు.

గర్భిణీ స్త్రీలను ఆంగన్వాడీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా నమోదు చేసి వారికి అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడం, హెచ్‌ఐవి సోకిన తల్లి నుండి బిడ్డకు ప్రసవ సమయంలో గాని, పాలు పట్టే సమయంలో హెచ్.ఐ.వి రాకుండా నిరోధించుటకు గర్భిణీగా వున్నప్పటి నుండి ఆంటీ రెట్రో వైరల్ మందులు వాడటం వలన పుట్ట బోయే బిడ్డకు హెచ్‌ఐవి రాకుండా కాపాడవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి వారిచే జారీచేయబడిన శుభవార్త కరపత్రం విడుదల చేశారు. ప్రోగ్రాం అధికారి లెప్రసి, ఎయిడ్స్ డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆంగన్వాడీ టీచర్లు గ్రామస్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు, గర్భిణీ స్త్రీలను సకాలంలో వైద్య పరీక్షలకు, అవసరమైన చికిత్సకు ప్రోత్సహించాల్సిన బాధ్యత  తీసుకోవాలని అన్నారు.

ఈ శిక్షణ ద్వారా ఆంగన్వాడీ టీచర్లు సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు, రాబోయే తరాలను హెచ్‌ఐవీ రహితంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించగలరని తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సారంగం, డాక్టర్ విజయ్ కుమార్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఎం‌పి‌హెచ్‌ఈ‌ ఓ లోక్య, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, సి‌ఎస్‌ఓ సారయ్య, ఎస్‌ఎస్‌కే మేనేజర్ రమేశ్, ఐసిటి‌సి కౌన్సిలర్ రమేశ్, అంగన్వాడీ సూపర్వైజర్స్, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.