చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
గట్టు, మార్చి 24: గద్వాల చేనేత జరీ చీరలు ఎంతో ప్రఖ్యాతి చెందాయని, ఇక్కడి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.మంగళవారం గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో పలువురు చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ మగ్గాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరగిద్ద చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నేసిన చేనేత చీరలను నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు.
సంస్థ కార్మికులు ఆర్థికంగా ఎదిగేందుకు వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.98 లక్షల రుణాలు ఇవ్వాలని గతంలోనే డిసిసిబి బ్యాంకులో అడగగా రాలేదని సంఘం అధ్యక్షుడు నర్సప్ప కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ ఎల్డీఎం శ్రీనివాసరావుతో మాట్లాడి బ్యాంకు రుణాలు మంజూరు చేయీస్తామని తెలిపారు.చేనేత చీరల తయారీకి కావాల్సిన ముడి సరకు, యంత్రాలు, డిజైనింగ్, తదితర విషయాల గురించి చేనేత కార్మికులు కలెక్టర్ కు వివరించారు.
ఒక చీర తయారు చేయడానికి పట్టే సమయం, చీరల డిజైన్ బట్టి ధరలు, నాణ్యత గురించి కార్మికులు సమగ్రంగా కలెక్టర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ను చేనేత కార్మికులు సన్మానించారు. అనంతరం ఆరిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఒక ఏరియాలో ఇళ్లమీదుగా ఉన్న హై టెన్షన్ విద్యుత్ తీగల సమస్యను గ్రామస్తులు కలెక్టర్ కు తెలియజేశారు.విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ వారికి తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్మాణంలో ఉన్న వాష్రూమ్స్ ను కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు.
అలాగే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి కలెక్టర్ సంబంధిత అధికారులను అడిగారు. నిర్మాణంలో ఉన్న ఒక ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు ప్రభుత్వము అందించే రూ.5 లక్షలతో పాటు, తాము జమ చేసుకున్న డబ్బుతో ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ పర్యటనలో గట్టు మండల ఎంపీడీవో చెన్నయ్య, చేనేత జౌళి శాఖ డివో సుధారాణి, గ్రామ సర్పంచ్ బాలకృష్ణ, తదితరులున్నారు.




