పెట్రో, వంట గ్యాస్ కొరత లేదు
- భయాందోళనలతో కొనుగోలు చేయొద్దు
- ఇంధనం అక్రమ నిల్వ చేసినా.. బ్లాక్ మార్కెట్ తరలించినా చర్యలు
- సివిల్ సప్లయ్‌శాఖ హెచ్చరిక
- సందేహాలు, ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ 1967కు ఫిర్యాదు చేయాలి
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాం గం పూర్తిగా, సక్రమంగా పనిచేస్తోందని, అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు.
కొన్ని పెట్రోల్ బంకుల్లో పొడవైన క్యూలు , తాత్కాలికంగా నో స్టాక్ బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం, తప్పుడు వదంతుల వల్ల ప్రజలు భయపడి అకస్మాత్తుగా ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడటమేనని తెలిపారు.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల వల్ల స్థానిక డీలర్లకు చిన్నపాటి తాత్కాలిక సమస్యలు ఎదురయ్యాయని, ఇది కేవలం అంతర్గత పరిపా లన పరమైన విషయం మాత్రమే తప్ప, సరఫరాలో లోపం కాదని స్పష్టం చేశారు. పరిస్థి తిని చక్కదిద్ది, అందరికీ సమానంగా ఇంధ నం అందేలా చూడటానికి కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీసు శాఖతో కలిసి పెట్రోల్ బంకులను నిరంత రం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసినా, బ్లాక్ మార్కెట్ చేసినా లేదా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు అక్రమంగా మళ్లించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్‌శాఖ అధికారులు హెచ్చరించారు. దయచేసి ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపవద్దని సూచించారు. ఏవైనా సందేహాలు ఉన్నా లేదా అక్రమాలపై ఫిర్యాదు చేయాలన్నా, ప్రజలు పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1967ను సంప్రదించాలన్నారు.
పెట్రోల్, గ్యాస్ నిల్వలు పుష్కలం హైదరాబాద్ సీపీ సజ్జనార్
పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడబోతోందంటూ వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మ వద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. నగరంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే సృష్టిస్తున్న పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని, పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
కృత్రిమ కొరతను సృష్టించి లాభపడాలని చూసే వ్యాపారులపై, ప్రజలను తప్పుదారి పట్టించే వారిపై చట్టపరమైన చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రాబోయే రోజుల్లో సమ్మె లేదా రవాణా నిలిపివేత కారణంగా ఇంధన సరఫరా ఆగి పోతుందన్న ప్రచారంతో మంగళవారం నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహ నదారులు బారులు తీరారు.
ఈ పరిస్థితిని గమనించిన కమిషనర్ సజ్జనార్ అధికారులతో సమీక్ష నిర్వహించి వాస్తవాలను వెల్ల డించారు. నగరంలోని ఆయిల్ కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, నిల్వలు సరిపడా ఉన్నాయని, సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని చెప్పారు. . నగరంలోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద పోలీసు నిఘా ఉంటుందని, కృత్రిమ కొరత సృష్టించినట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.




