10-11-2024 03:21:52 PM
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నగరంలోని ఏకలవ్య పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి అనే విద్యార్థిని ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే విద్యార్థిని లక్ష్మీనగరం ఏకలవ్య పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థిని తల్లిదండ్రులను పిలిపించి ధనలక్ష్మి ప్రవర్తన బాగోలేదని క్రమశిక్షణ చర్యల కింద పది రోజులు ఇంటికి తీసుకువెళ్లాలని, లేనిపక్షంలో టిసి ఇచ్చి పంపిస్తామని చెప్పారు. విద్యార్థిని తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడిన ప్రిన్సిపాల్ వినకపోవడంతో ధనలక్ష్మి తల్లిదండ్రులు ధనలక్ష్మిని ఇంటికి తీసుకువెళ్లారు. అనంతరం పాఠశాలలో జరిగిన అవమానానికి మనస్థాపం చెందిన ధనలక్ష్మి పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన విద్యార్థిని కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు ధనలక్ష్మిని ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.