ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
*12వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేయాలి
*జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, ఆగస్టు 6 (విజయక్రాంతి): జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, 12వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్న సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ముఖ్య మంత్రి పర్యటనలో అధికారులు అప్రమత్తంగా ఉండి అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు.
పైలాన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, సమావేశ మందిరం, మంత్రివర్గ గది, అదనపు కలెక్టర్ల చాంబర్ల లో అవసరమైన అన్ని సదుపాయాలతో సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆగస్టు 12వ తేదీలోపు అన్ని పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మేడారం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి హెలిప్యాడ్ ల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన మరమ్మతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
వీఐపీల బస కోసం ప్రత్యేక అతిథి గృహాలను సిద్ధం చేయడంతో పాటు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి మేడారం శ్రీ సమ్మక్కసారలమ్మ వనదేవతలను దర్శించుకునే సందర్భంగా పూజా కార్యక్రమాలు, శేష వస్త్రాల సమర్పణ, ఆశీర్వచనాల ఏర్పాట్లు, ఆలయ పరిసరాల పరిశుభ్రత, అవసరమైన సౌకర్యాలను ముందుగానే పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. వైద్య శాఖ అన్ని అత్యవసర సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని, అవసరమైన మందులు, వైద్య బృందాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
హెలిప్యాడ్ ప్రాంతంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది, వాహనాలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, శాఖల మధ్య సమన్వయం లోపించకుండా చూడాలని సూచించారు. అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తించి, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమీక్షించి, ఆగస్టు 12వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, స్థానిక సంస్థలు సంపత్ రావు,ఆర్డీవో కృష్ణవేణి, డిఆర్‌ఓ రవికుమార్, ఎస్డిసి ప్రతాప్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కుషీల్ వంశీ, ఆర్డీవో కృష్ణవేణి, డి ఎస్ పి రవీందర్, జిల్లా అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






