10-12-2025 02:29:12 AM
తొలి విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు సన్నద్ధం 11న తొలి విడత ఎన్నికలు
షాద్ నగర్/ఫరూక్ నగర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికలకు తొలి విడత ప్రచారం ముగిసింది. షాద్ నగర్ నియోజకవర్గంలో 153 గ్రామపంచాయతీల కు ఈ నెల ఎన్నికలు జరగనున్నాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఎన్నికల సంబంధించిన సామాగ్రి ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు ఇప్పటికే చేరింది.
నియోజకవర్గం లో ఆరు మండలలో మొత్తం 410 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఫరూక్ నగర్ మండలంలో 47 గ్రామపంచాయతీలకు 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా స్టేషన్లకు సంబంధించి 553 మంది పిఓలు, 553 మంది ఓపివోల ను కేటాయించారు. ఇక 12 మంది రూట్ ఆఫీసర్లు, నలు గురు జోన్ ఆఫీసర్లు ఈ మండలానికి కేటాయించబడ్డారు.
ప్రతి గ్రామ పంచా యతీకి ఒక ఆర్వోను ఏర్పాటు చేస్తున్నారు. 410 పోలింగ్‌స్టేషన్లలో అయ్యవారి పల్లి ఏకగ్రీవం కావడంతో 5 పోలింగ్‌స్టేషన్‌లు రద్దు చేయబడ్డాయి. ఇక 12 రూట్ల లో 35 బస్సులను విధులను నిర్వహించే సిబ్బంది కోసం ఏర్పాటు చేశారు. బుధవారం సిబ్బందులకు విధులు కేటాయించగా, ఇప్పటికే వారికి అనుమతి పత్రా లు అందజేసినట్లు ఎంపీడీవో బన్సీలాల్ వెల్లడించారు.
ఫరూక్‌నగర్ మండలంలో 500 మందితో బందోబస్తు
ఫరుక్ నగర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మొత్తం 15 పోలింగ్ కేంద్రాలు అదేవిధంగా 410 పోలింగ్ స్టేషన్లలో మొత్తం 500 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు షాద్ నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇద్దరు ఏసీపీలు, 6 మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు మిగతా సిబ్బంది మొత్తం 500 మందితో భారీ బందోబస్తు ఎన్నికల కోసం ఏర్పాటు చేయనున్నట్లు సిఐ తెలిపారు.