మోదీ, రాహుల్‌కు ఈసీ నోటీసులు

25-04-2024 11:42:13 PM

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ లేఖ

వివరణ ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీకి ఆదేశాలు

మోదీ బంగారం వ్యాఖ్యలపైఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

రాహుల్ మలయాళం వ్యాఖ్యలపై బీజేపీ కంప్లెయింట్


స్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నోటీసులు జారీచేసింది. ప్రచారంలో భాగంగా పలు సందర్భాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆక్షేపించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీలను ఆదేశించింది. ‘స్టార్ క్యాంపెయినర్లు హూందాతనంతో ప్రసంగాలు చేయాలి. అఖిల భారత దృక్కోణంలో ప్రచారం చేస్తుండాలి. కానీ కొన్ని సార్లు ప్రాంతీయ స్థాయిలో నేతల ప్రసంగాలు అలా ఉండట్లేదు’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈసీ రాసిన లేఖలో పేర్కొంది. బీజేపీలోని స్టార్ క్యాంపెయినర్లు అందరూ రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు ఎంతో హూందాతనంతో వ్యవహరించేలా చూడాలని జేపీ నడ్డాకు ఈసీ సూచించింది. ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

మోదీ ఏం మాట్లాడారు?

రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ‘మన తల్లులు, చెల్లెళ్ల బంగారాన్ని లెక్కించి, ఆ సంపదను పంచిపెడుతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ తల్లులు, చెల్లెళ్ల మంగళసూత్రాలు కూడా లాక్కుంటుంది. లాక్కున్న ఆ బంగారాన్ని ఎవరికి పంచిపెడుతారు? దేశంలోని వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చెప్పింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలోని సంపదపై తొలి హక్కు ముస్లింలకే ఉందని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు. అంటే దీనర్థం ఏంటి? సంపదను ఎవరికి పంచిపెడుతారు? ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచిపెడుతారా? లేదంటే చొరబాటుదారులకు పంచిపెడుతారా? మీరు ఎంతో కష్టపడి సంపాదించిన సంపదను చొరబాటుదారులకు పంచిపెట్టనివ్వాలా? దీన్ని మీరు ఆమోదిస్తారా?’ అని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్‌కు కూడా హెచ్చరికలు చేసింది. తమ తమ స్టార్ క్యాంపెయినర్లు కూడా విద్వేష పూరిత ప్రసంగాలు చేయకుండా చూడాలని తలంటింది. కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేస్తూ రాహుల్ పై బీజేపీ ఫిర్యాదు ప్రతిని జతపరిచింది. 

రాహుల్ ఏమన్నారంటే..

కేరళలోని కొట్టాయంలో రాహుల్ గాంధీ ప్రసంగం భాషాపరమైన విబేధాలు సృష్టించే  ప్రయత్నం చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ‘కూతురు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందితే.. తల్లిదండ్రులు మలయాళంలో శుభాకాంక్షలు చెబుతారు. ఒక సోదరుడు మరో సోదరుడిని కోల్పోతే మలయాళంలోనే మాట్లాడుకుంటారు. దీన్ని బట్టి కేరళ అంటేనే మలయాళం, మలయాళం అంటేనే కేరళ’ అని రాహుల్ పేర్కొన్నారు.