రాకుమారులు వస్తున్నారు

26-04-2024 12:05:00 AM

బుజ్జగింపు రాజకీయాలు చేయడమే వారి పని

రాహుల్, అఖిలేశ్‌పై ప్రధాని మోదీ మండిపాటు

ఓబీసీల నుంచి రిజర్వేషన్లు లాక్కొంటారు

మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ అసలు రంగు తెలిసింది


షాజహాన్‌పూర్ (యూపీ), ఏప్రిల్ 25: బుజ్జగింపు రాజకీయాలు చేసేందుకు ఇద్దరు రాకుమారులు కలిసి వస్తున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. గురువారం ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, ఎస్పీ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఫ్లాప్ అయిన ఇద్దరు అబ్బాయిల జంట నుంచి అభివృద్ధి ఆశిస్తామా?’ అని పరోక్షంగా రాహుల్, అఖిలేశ్‌ను ఎద్దేవా చేశారు. ఓ వర్గం వారిని సంతృప్తి పరిచేందుకే ఇద్దరు రాకుమారులు ఒక్కటై వస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఎప్పుడూ ఓబీసీ.. ఓబీసీ అంటూ మాట్లాడుతూ.. ఓబీసీల నుంచి రిజర్వేషన్లు లాక్కుని ముస్లింలకు ఇచ్చేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇక, కాంగ్రెస్ ఏదైనా పెద్ద తప్పు చేయాలని అనుకుంటే చాలు.. ఇక దేశం పేరుతో, రాజ్యాంగం పేరుతో ఆరాటం చేస్తారంటూ ప్రధాని మోదీ మండిపడ్డారు. 1970లలో కూడా ఇలాగే జరిగిందని, ఆ సమయంలో కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి దేశం మొత్తాన్ని జైలులా మార్చిందని గుర్తు చేశారు. 

కాంగ్రెస్ ఫ్లాస్ సినిమా..

మరోసారి కాంగ్రెస్ ఫ్లాప్ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధపడిందని ఎద్దేవా చేశారు. ఆ సినిమాలో రెండే డైలాగ్స్ ఉన్నాయని చెప్పారు. ఒక్కటి.. మోదీ గెలిస్తే నిరంకుశత్వ పాలన వస్తుందని, రెండోది మోదీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని చెబుతారంటూ వ్యాఖ్యా నించారు. ఇలాంటి అబద్ధాలు కాంగ్రెస్ ప్రచా రం చేస్తూనే ఉంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ట్రైలర్ ద్వారా కాంగ్రెస్ నిజ స్వరూపం, వారి అసలు ఎజెండా దేశానికి తెలిసిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అసలు నిజాలు ఒకదాని వెంట మరొకటి వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.