01-12-2025 07:22:37 PM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
వనపర్తి,(విజయక్రాంతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాదు నుండి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు మండల తహసిల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండవ విడత నామినేషన్ల స్వీకరణ, వచ్చిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.
ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి మండల స్థాయిలలో అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు.