15-05-2025 02:19:59 AM
అమ్మవారిని మొక్కుకున్న జిల్లా జడ్జి
హుస్నాబాద్, మే 14 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎల్లమ్మ మహా జాతర వైభవంగా సాగుతోంది. ఈ ఉత్సవ సందడిలో సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, హు స్నాబాద్ ఏసీపీ సదానందం బుధవారం ఎల్లమ్మతల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాలోని అత్యున్నత న్యాయాధికారి, పోలీస్ అధికారి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.
అనంతరం జిల్లా జడ్జి సాయి రమాదేవి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మొక్కుకున్నానన్నారు. జాతర మొదలైనప్పటి నుంచే ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు తమ ఇష్టదైవమైన ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించి తమ భక్తిని చాటుకుంటున్నారు. బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు పెడుతున్నారు.
ఓడిబియ్యాలు నివేదిస్తున్నారు. శివసత్తుల పూనకాలు, ఈరగోల దెబ్బలు, జమిడిక మోతలతో ఆల య ప్రాంగణం జానపద సాంస్కృతిక సందడిగా మారింది. గ్రామీణ ప్రజలు కోళ్లను, మేకలను బలి ఇస్తూ, అక్కడే వండుకొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేస్తున్నారు. బంధుమిత్రులు ఒకచోట చేరి అమ్మవారి కృపను స్మరించుకుంటూ సందడి చేస్తున్నారు.