calender_icon.png 16 December, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా దృష్టికి ఆక్రమణల సమస్యలు

16-12-2025 12:59:45 AM

  1. చెరువులు, నాలాల కబ్జాపై ఫిర్యాదులు
  2. ప్రజావాణికి బాధితుల క్యూ..౪౬ అర్జీలు సమర్పణ
  3. పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): నగరంలో పర్యావరణాన్ని కాపాడటం ఒక్క హైడ్రా తోనే సాధ్యం. చెరువులు, నాలాలను పరిరక్షించి.. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను పార్కులుగా మార్చి మాకు ప్రాణవాయువును అందించండి అంటూ నగరవాసులు హైడ్రా ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి బాధితులు పోటెత్తారు. మొత్తం 46 ఫిర్యాదులు అందగా, కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో విస్తుపోయే నిజం వెలుగుచూసింది.

అక్కడ కోర్టు భవనం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డుగా మార్చేశారు. అక్కడే చెత్త వేసి తగులబెడుతుండటంతో చుట్టుపక్కల కాలనీవా సులు, ఆసుపత్రుల రోగులు పొగ, దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, వెంటనే ఆ స్థలాన్ని కాపాడాలని స్థానికులు హైడ్రాను వేడుకున్నారు.రామంతాపూర్ పెద్ద చెరువులో తమ ప్లాట్లు మునిగిపోయాయని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

1958 నాటి లే-అవుట్‌లో ప్లాట్లు కొన్నామని, చెరువు బండ్ నిర్మించినప్పుడు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదని వాపోయారు. చెరువు అభివృద్ధికి తాము అడ్డుకాదని, తమకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు.బాలాపూర్ మండలం కురుములగూడలోని రాజీవ్ గృహకల్ప జన్నారం కాలనీ లో అక్రమాలు పెరిగిపోయాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నవారు అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలాలను ఆక్రమించి దుకాణాలు, అదనపు గదులు నిర్మించుకుని కిరాయిలకు ఇస్తున్నారని నివాసితులు ఫిర్యాదు చేశారు.

దీనివల్ల పార్కింగ్‌కు, రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, ఆక్రమణల ను తొలగించాలని కోరారు. నిజాంపేట.. తుర్క చెరువు కింద ఉన్న 10 గుంటల ప్రభుత్వ భూమిని బడా నిర్మాణ సంస్థలు కబ్జా చేసి ప్రహరీలు కడుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు.అమీన్‌పూర్.. పెద్ద చెరువు నుంచి బందం కొమ్ము చెరువుకు వెళ్లే వరద కాలువను రియల్ ఎస్టేట్ సంస్థలు ఆక్రమిం చాయని, ఎన్‌జీటీ కేసులు ఉన్నా లెక్కచేయకుండా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు.