calender_icon.png 13 July, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టుకు ఇంజినీరింగ్ కాలేజీలు!

28-06-2025 01:12:15 AM

  1. ఫీజుల వ్యవహారంలో కోర్టుకు వెళ్లాలని యోచన
  2. ఫీజులను పెంచాల్సిందేనని పట్టుబడుతున్న కాలేజీలు

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ఫీజుల వ్యవహారంపై ఇంజినీరింగ్ కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇంజినీరింగ్ ఫీజు లు విషయపై కోర్టుకెళ్లే యోచనలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫీజులను ఖరారు చేయకుండా కౌన్సిలింగ్ నిర్వహణలాంటి అంశాలను వ్యతిరేకిస్తున్నాయి. ఫీజులను పెంచాలని పలు ప్రైవేట్ కాలేజీలు పట్టుబడుతున్నాయి.

కానీ ప్రభుత్వం మాత్రం మెరుగైనా వసతులు, ప్రమాణాలను చూసే ఫీజులను ఖరా రు చేయాలని భావిస్తోంది. ఈక్రమంలోనే న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు యోచిస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఈ విషయంలో న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి కూడా.

అయితే కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను శుక్రవారమే విడుదల చేయడంతో ఒకట్రెండు రోజులు వేచి చూసే ధోరణీలో ప్రైవేట్ కాలేజీల యా జమాన్యాలు ఉన్నట్లుగా తెలిసింది. ప్రభు త్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లుగా ఆయా యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఫీజు రీ యింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిల కోసం కోర్టును కొన్ని కాలేజీలు ఆశ్రయించాయి.

ఫీజులను పెంచాల్సిందే!....

రాష్ర్టంలో 1,250కి పైగా ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీలున్నాయి. ప్రతి మూడేళ్ల బ్లాక్ పిరియడ్‌కు తెలంగాణ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) ఫీజులను నిర్ణయి స్తోంది. ఈక్రమంలో 2022 నిర్ణయించిన ఫీజులు గత విద్యాసంవత్సరం 2024 వరకు అమలు చేశారు. ఇప్పు డు మళ్లీ రాబోయే మూడేళ్లకు అంటే 2025 (బ్లాక్ పిరియడ్)కు ఫీజలను ఖరారు చేయాల్సి ఉంటుంది.

ఈక్రమంలో టీఏఎఫ్‌ఆర్సీ ఆయా కాలేజీలతో హియరింగ్ ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకుసమావేశాలు నిర్వహించి, ఫీజుల ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బీటెక్, ఎంటెక్ తదితర కోర్సులకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 వరకు, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ, ఇతర ఫార్మా కోర్సులకు మార్చి 12 నుంచి 18 వరకు, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు మార్చి 23, బీపీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులకు ఏప్రిల్‌లో హియరింగ్ చేపట్టి కాలేజీలు ఇచ్చిన లెక్కలకు(ఆడిట్ రిపోర్టులు) అనుగుణంగా కాలేజీల వారీగా ఫీజుల ప్రతిపాదనలను సిద్ధం చేశారు.

అయి తే ఆ ఫీజులను ఆమోదించాల్సిన తరుణం లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యతంరం తెలిపింది. కొన్ని కాలేజీల్లో ఫీజులు భారీగా పెర గడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజుల పెం పు లేదని ప్రస్తుతానికి పాత ఫీజులనే వసూ లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ ఫీజుల ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

ప్రభుత్వంపై అదనపు భారమే...

టీఏఎఫ్‌ఆర్సీ ప్రతిపాదిత ఫీజులపై ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేయాలని భావించి అందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాప్రమాణలు కాలేజీల్లో సరిగా ఉన్నాయా? లేదా? అధ్యయనం చేశాకే ఫీజుల అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంత వరకు పాత ఫీజులే అమల్లోకి ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు వచ్చే మూడేళ్లకు ఫీజులను పెంచి తే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే కాలేజీల్లో సరైనా మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు ఉన్నాయా? చూసి దానిప్రకారమే ఫీజులను నిర్ధారించాలని అధికారులను ఇప్పటికే ఆదేశించింది. అధికారులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. టీఏఎఫ్‌ఆర్‌సీ ఇప్పటికే ప్రతిపాదించిన ఫీజులతో ప్రభుత్వంపై సుమారు రూ.600 కోట్లపైనే భారం పడే అవకాశమున్నట్లు అంచానా. ఇదిలా ఉంటే ఎప్‌సెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి.

ప్రభుత్వమేమో ఈ సంవత్సరం పాత ఫీజులనే వసూలు చేయాలని అంటోంది. ఆ రకంగానే ఫీజులను కాలేజీలు వసూలు చేశాయనుకుంటే కమిటీ నివేదిక వచ్చాక ఆ కాలేజీ ఫీజు ఒకవేళ పెరిగితే విద్యార్థి మళ్లీ ఆ పెరిగిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కమిటీ నివేదిక ఆలస్యమైతే రెండో ఏడాది ఫీజులు ఏవిధంగా వసూలు చేస్తారనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.

దీనిపై  స్పష్టత లేకపోవడంతో ఈసారి ఎప్‌సెట్ కౌన్సిలింగ్ కాస్త గందరగోళంగా మారే అవకాశముందని విద్యావర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడూ ప్రైవేట్ కాలేజీలు కూడా కోర్టు మెట్లు ఎక్కే ఆలోచనలో ఉండడంతో ఈసారి కౌన్సిలింగ్ సాఫీగా జరిగేనా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.