13-07-2025 06:00:01 PM
తీరు మారకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తా..
చిన్న బాబుకోరూలు.. నాకో రూలా..?
ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే వినోద్ వార్నింగ్..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): బెల్లంపల్లి అటవీ శాఖ అధికారులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి(MLA Gaddam Vinod Venkataswamy) మండిపడ్డారు. మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో ఆదివారం అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వనమహోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. నెన్నల మండలంలో పత్తి రైతుల సాగు భూమిని ధ్వంసం చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్న విషయం, పోడు భూములపై అటవీ అధికారుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతులకు ఇబ్బంది పెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదనీ మండిపడ్డారు. నియోజకవర్గంలో పొడు రైతులను ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే గట్టిగా చెప్పారు.
చినబాబు(ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్) చెన్నూర్ నియోజకవర్గంలో అధికారులది ఒక రూలు బెల్లంపల్లి నియోజకవర్గంలో మరోక రూలా? అనీ అటవీ శాఖ అధికారులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తీరు మారకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని అధికాలను హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే అటవీ అధికారులు తమ దృష్టికి తీసుకురావాలని, అంతేకానీ రైతులను ఇబ్బందికి గురిచేస్తే మాత్రం సహించబోమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి అటవీ అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూముల సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని,జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానన్నారు. అంతేగాని అటవీ అధికారులు నేరుగా వెళ్లి రైతుల పంటలను ధ్వంసం చేయో వద్దని ఆదేశించారు. నియోజవర్గంలో ఇలాంటి సమస్యలు పొరపాటు కాకుండా నడుచుకోవాలని అటవీ అధికారులను కాసింత గట్టిగానే మందలించడంతో రైతులకు ఊరట కలిగింది.