28-01-2026 12:00:00 AM
స్కూల్ డైరెక్టర్ మణిమాల
ముగిసిన నేతాజీ జన్మదినవారోత్సవాలు
అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
తాండూరు, జనవరి 27 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు భారతీయ సంస్కృతి, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ,దేశభక్తి పెంపొందించడమే తమ లక్ష్యమని వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో ఉన్న ప్రముఖ శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ ప్రవేటు పాఠశాల డైరెక్టర్ మణిమాల అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వారోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. ఈ ఉత్సవాల్లో విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, త్యాగాలు, దేశభక్తిని ప్రతిబింబించే ప్రసంగాలు, నాటికలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను విద్యార్థులు చూడముచ్చటగా కన్నుల పండుగగా వివరించారు. వారు ప్రదర్శించిన దేశభక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక , దేశ ఐక్యత, సమగ్రతపై చేసిన అవగాహన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ మణిమాల మాట్లాడుతూ విద్యతో పాటు భారతీయ సంస్కృతి ,విద్యార్థుల్లో దాగి ఉన్న కళా నైపుణ్యం నృత్యం, సంగీతం, నాటకం వంటి కళలతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పెంపొందిస్తూ వారి సామర్థ్యం సమాజానికి తెలిసేలా..విద్యార్థుల తల్లిదండ్రులు గర్వించేలా చేయడమే తమ పాఠశాల లక్షమని.. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహకరిస్తున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రిన్సిపాల్ శివలీల వార్షిక నివేదికను వివరించారు. గత విద్యాసంవత్సరంలో విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాలలో విద్యార్థులు సాధించిన విజయాలు, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ లక్ష్యాలను సభకు వివరించారు. క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు.