28-01-2026 12:00:00 AM
తాండూరు, జనవరి27 (విజయక్రాంతి): మహిళ వద్ద ఉన్న బంగారు వెండి నగలు తస్కరించేందుకు ఆమెను దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసు కు సంబంధించిన వివరాలను వికారాబాద్ జిల్లా తాండూర్ డిఎస్పి నర్సింగ్ యాదయ్య, రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్త్స్ర శంకర్ తో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. యాలాల మండలం పగడాల గ్రామానికి చెందిన బందెమ్మ(54) తాండూర్ పట్టణంలో అడ్డా కూలిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
అయితే ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి నగలను తస్కరించేందుకు అడ్డా కూలీలుగా పని చేస్తున్న పెద్దముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన మాల నరసింహులు మరియు కర్ణాటక రాష్ట్రం, బసవ కళ్యాణ్, చరణ్ నగర్ కు చెందిన కిషోర్ సిందే ఇద్దరు కలిసి ఈనెల 22వ తేదీన కూలి పని ఉందంటూ నమ్మించి బందెమ్మను పెద్దేముల్ మండలం రేగోండి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశారు .అనంతరం ఆమె వద్ద ఉన్న 22 గ్రాముల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను తీసుకొని పారిపోయి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లోని ఓ బంగారు దుకాణంలో 49 వేల రూపాయలకు నగలను విక్రయించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పట్టణంలోని పలు కూలి అడ్డాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా బందేమ్మను తీసుకెళుతున్న ఇద్దరినీ గుర్తించి విచారణ చేయగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో పాటు చోరీ చేసిన నగలను స్వాధీనం చేసుకొని నర్సింలు, కిషోర్ షిండే ను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నర్సింలు 2022 సంవత్సరం ఓ మహిళను యాలాల మండలం రాస్నo అటవీ ప్రాంతంలో ఇదే తరహాలో హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. నరసింహులు పై రెండు మర్డర్ కేసులు నమోదు కావడంతో అతడి పై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డిఎస్పి తెలిపారు.ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ దస్తప్ప, కానిస్టేబుల్స్ మున్నప్ప, ప్రతాప్ సింగ్, కృష్ణారెడ్డి, అంజాద్ లను డి.ఎస్.పి అభినందించి రివార్డులను అందించారు.