16-12-2024 12:55:18 AM
100 కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడాలనే ఉద్ధేశంతో వారికోసం అనేక రకాల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా మని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ మొండా మార్కెట్ డివిజన్‌లో జేసీఐ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను అంబర్ పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్ సెంటర్లు.. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి విస్తరించాయన్నారు. పేద, మధ్య తరగతి మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి ఉద్యోగాలు కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు.
గ్రామీణ ప్రాంతంలో మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇప్పించి.. వ్యవసాయంలో వాటిని వాడుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ‘డ్రోన్ దీదీ’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే 15 వేల గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద శిక్షణ ఇచ్చి 15 వేల డ్రోన్లు అందించామన్నారు. ముద్ర బ్యాంకు, స్వనిధి యోజన, స్వయం సహాయక సంఘాలకు లక్షల రూపాయల లోన్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.