calender_icon.png 19 January, 2026 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌కు యూరోపియన్ యూనియన్ షాక్

19-01-2026 01:27:07 AM

అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టీకరణ

అట్లాంటిక్ వాణిజ్య ఒప్పందానికి బ్రేక్

యూఎస్‌పై ‘యాంటీ కోయర్షన్’ను ప్రయోగించే యోచన

న్యూయార్క్, జనవరి 18 : గ్రీన్‌ల్యాండ్ ద్వీపం కొనుగోలు వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై ఐరోపా సమాఖ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాతో కుదుర్చుకున్న కీలక వాణిజ్య ఒప్పందమైన అట్లాంటిక్ వాణిజ్య ఒప్పందం(యూఎస్‌ఈయూ) ఐరోపా పార్లమెంట్ తాజాగా నిలిపివేసింది. ట్రంప్ విధించిన కొత్త సుంకాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాకు బిగ్‌షాక్ ఇవ్వడమే కాదు.. యూఎస్‌పై యాంటీ కోయర్షన్‌ను ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. అమెరికా ఒత్తిడికి ఎట్టిపరిస్థితుల్లో తలొగ్గే ప్రసక్తే లేదని ఐరోపా కౌన్సి ల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్‌ను డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయాలన్నది ట్రంప్ ప్రధాన డిమాండ్.

దీనికి మద్దతు ఇవ్వని ఐరోపా దేశాలపై ఆయన అదనపు సుంకాలు విధించారు. ఆర్కిటిక్ ప్రాంతానికి సైన్యాన్ని పంపిన దేశాలపై పది శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. జూన్ ఒకటి నుంచి ఈ సుంకాన్ని 25 శాతానికి పెంచుతామని కూడా ఆయన హెచ్చరించారు. గ్రీన్ ల్యాండ్ కొనుగోలు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రష్యా, చైనా కార్యకలాపాల నేపథ్యంలోనే తాము సైన్యాన్ని పంపామని ఐరోపా నేతలు చెబుతున్నారు. ట్రంప్ తమ దేశాలను బెదిరిస్తున్నారని వారు స్పష్టం చేశారు. 

యూఎస్‌పై కూడా ఆంక్షలు: ఈయూ

అట్లాంటిక్ వాణిజ్య ఒప్పందం గత ఏడాది ట్రంప్, ఉర్సులా వాన్ డెర్ లేయన్ మధ్య కుదిరింది. ఉభయ పక్షాల మధ్య సుం కాలను తగ్గించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. అయితే ట్రంప్ తీరుతో ఐరోపా సమాఖ్యలోని ప్రధాన రాజకీయ పక్షాలు యూఎస్‌ఈయూ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఉత్పత్తులపై సున్నా సుంకం అమలు చేయడం సాధ్యం కాదని సభ్యులు స్పష్టం చేశారు. గ్రీన్‌ల్యాండ్ వివాదాన్ని వాణిజ్యంతో ముడిపెట్టడం సరికాదని వారు అభి ప్రాయపడ్డారు.

అమెరికా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తేల్చి చెప్పారు. తాము కూడా గట్టిగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరుకు ప్రతిస్పందనగా ఐరోపా సమాఖ్య (ఈయూ) పలు కఠినమైన వాణిజ్య ఆంక్షలను సిద్ధం చేస్తోంది. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసే విషయంలో ట్రంప్ ఐరోపా దేశాలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనికి నిరసనగా ఐరోపా సమాఖ్య తన అత్యంత శక్తివంతమైన ‘యాం టీ కోయర్షన్’ నిబంధనలను ప్రయోగించాలని భావిస్తోంది.

అమెరికాలోని టెక్ దిగ్గజాలపై కొత్త పన్నులు!

ట్రంప్ విధించిన పది శాతం సుంకాలను ఎదుర్కోవడానికి ఐరోపా సమాఖ్య ముఖ్యం గా అమెరికాలోని టెక్ దిగ్గజాలపై కొత్త పన్నులు విధించే అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చే విలాసవంతమైన వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచాలని సమాఖ్య యోచిస్తోంది. ప్రజాసేకరణ పనుల్లో అమెరికా కంపెనీల భాగస్వామ్యాన్ని పరిమితం చేసే యోచనలో ఉంది. మేధో సంపత్తి హక్కు ల రక్షణకు సంబంధించిన నిబంధనలను అమెరికాకు వ్యతిరేకంగా కఠినతరం చేసే అవకాశం ఉంది.

అమెరికాకు దీటుగా జవాబిస్తాం: ఐరోపా నేతలు

ఐరోపాలోని ఎనిమిది కీలక దేశాలను ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్ వంటి దేశాలపై ఆయన ఆంక్షలు ప్రకటించారు. దీనికి ప్రతిగా అమెరికా నుంచి వచ్చే పెట్టుబడులపై ఆంక్షలు విధించాలని ఐరోపా పార్లమెంట్ సభ్యులు కోరుతున్నారు. అమెరికా ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో ఉన్న ప్రాధాన్యతను తగ్గించాలని వారు ప్రతిపాదించారు. బుధవారం జరిగే కీలక సమావేశంలో ఈ ఆంక్ష లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా దీటుగా జవాబిస్తామని ఐరోపా నేతలు స్పష్టం చేస్తున్నారు.

8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు: ట్రంప్

గ్రీన్‌ల్యాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సరకులపై 10 శాతం అదనపు సుంకం ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందని శనివారం ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు ఈ సుంకం వర్తిస్తుందని తెలిపారు.

గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా సంపూర్ణంగా కొను గోలు చేయడంపై జూన్ 1కల్లా అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25 శాతా నికి పెంచుతానని ట్రంప్ హెచ్చరించారు. అయితే గ్రీన్‌ల్యాండ్ విషయంలో ట్రంప్ వాదనతో అమెరికన్ కాంగ్రెస్ ద్వైపాక్షిక ప్రతినిధి బృందం విభేదించింది. ట్రంప్ మాటలు ఎలా ఉన్నా తాము డెన్మార్క్, దాని భూభాగమైన గ్రీన్‌ల్యాండ్‌కు మద్ద తు తెలుపుతున్నామని శనివారం స్పష్టం చేసింది.