25-07-2024 02:07:12 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ప్రజలు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం తగ్గటంలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా వారి బుద్ధి ఏ మాత్రం మారలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ చేసిన దోపిడీ, తప్పుడు విధానాల వల్లే ప్రజలు వారిని శిక్షించారని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. బుధవారం అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రసంగంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో తాము బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశామని, కేంద్రం సహకరించకపోయినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని కేటీఆర్ తెలుపగా, సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చా రు.
బీఆర్‌ఎస్ పాలనను చూసిన తర్వాతే.. ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని పేర్కొన్నారు. ఆ తీర్పు ద్వారా అయినా బీఆర్‌ఎస్ నేతలకు జ్ఞానోదయం కలుగుతుందని ప్రజ లు భావించారని, కానీ వారిలో అదే అహంకారం ఉందని దుయ్యబట్టారు. ఇతరులను కించపర్చేలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలువలేక చతికిలపడిందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు బలమైన స్థానంగా ఉన్న సిరిసిల్లలో కూడా ఆ పార్టీ గెలువలేదని, ఆ ఓట్లు ఎక్కడికి బదిలీ అయ్యాయని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా బుద్ధి మారక పోతే ఎలా? అని నిలదీశారు.
బీజేపీతో అంటకాగిన బీఆర్‌ఎస్
అసెంబ్లీలో చర్చను కేటీఆర్ దుర్వినియోగం చేశారని, అబద్ధాలు చెప్పారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. గత పదేళ్లలో చేసిన పాపాలను కప్పి పుచ్చుకునేలా కేటీఆర్ ప్రసంగం సాగిందని ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు, ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్లు, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఎక్కడికో తీసుకెళ్లినట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 2014 నుంచి 2021 వరకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేదని, ఆ సమయంలో మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వం ఊడిగం చేసిందని విమర్శించారు. ఆ సమయంలో లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీయేకు బీఆర్‌ఎస్ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిందని అన్నారు.
నాడు మోదీ ప్రేమలో మునిగిన కేసీఆర్
2016 ఆగస్టులో మిషన్ భగరీథ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ తో.. తమ రాష్ట్రానికి నిధులు వద్దని, మీ ప్రేమ చాలు అని కేసీఆర్ అన్న మాటల ను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. నాడు మోదీ ప్రేమలో కేసీఆర్ మునిగి తేలారని, ఆ తర్వాత తెలం గాణను నిండా ముంచారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ప్రజ ల హక్కులను మోదీకి తాకట్టు పెట్టిన బీఆర్‌ఎస్.. ఇప్పు డు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం, బీజేపీకి వ్యతిరేకంగా వారు పోరాటం చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. విద్యుత్ విధానంపై ఇప్పటివరకు తెలంగాణకు ఎలాంటి పాలసీ లేద ని సీఎం తెలిపారు. విద్యుత్ పాలసీని ఎలా తీసుకురాబోతున్నామనేది చెప్పేందుకు ఈ సభలోనే చర్చ పెడుతామని చెప్పారు.
బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రం దివాళా
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని సీఎం అన్నారు. అం దుకు వారి అసమర్థ పాలనే కారణమని విమర్శించారు. 2014లో రూ.14 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో.. ఏడాదికి రూ. 6,500 కోట్లు అప్పు చెల్లించేదని, పదేళ్ల తర్వాత అప్పులు రూ.7 లక్షల కోట్లకు చేరాయని, ఇప్పుడు ఏడాది రూ.70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. విద్యుత్‌శాఖకు రూ.88,000 కోట్ల అప్పు లు ఉన్నాయని, సింగేరణికి బకాయిలు అలాగే ఉన్నాయని వివరించారు. మేడిగడ్డ కుప్పు కూలిపోయిందని, కాళేశ్వరా నికి తెచ్చిన అప్పులు అట్లనే ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్ నేతలు పదేపదే జీడీపీ గురించి మాట్లాడుతున్నారని, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అన్ని విషయాలను వెల్లడిస్తామని సీఎం ప్రకటించారు.