calender_icon.png 21 November, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు హైకోర్టు నోటీసులు

25-07-2024 02:04:53 AM

కోకాపేటలో భూ కేటాయింపుపై వివరణ కోరిన న్యాయమూర్తి

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిని పార్టీకి కేటాయించారంటూ దాఖలైన పిటిషన్‌పై బీఆర్‌ఎస్ పార్టీకి బుధవారం హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ భూకేటాయింపుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా, నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. ఏవైనా నిర్మాణాలు ప్రారంభించినట్టయితే ఆ విషయాన్ని కోర్టు దష్టికి తీసుకురావచ్చని సూచించి, విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో సర్వే నం.239, 240లో 11 ఎకరాలను బీఆర్‌ఎస్‌కు కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన జే అశోక్‌దత్ జయశ్రీ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీ మురళీ మనోహర్ వాదనలు వినిపిస్తూ .. గత ఆదేశాల మేరకు స్థలానికి చెందిన రిజిస్ట్రేషన్ పత్రాలతోపాటు ముంతకాబ్లను అంద జేశారు. వీటిని హైకోర్టు రికార్డుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూమి ని పిటిషనర్లు వారసత్వంగా పొందారని చెప్పారు. నవాబ్ నుస్రత్ జంగ్ 1 నుంచి వారసుల పవర్ ఆఫ్ అటార్నీ పొందిన జే హెచ్ కృష్ణమూర్తి నుంచి 1967లో పిటిషనర్ పూర్వీకులు కొనుగోలు చేశారని చెప్పారు. నిరుడు మే 23న బీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం ఇచ్చిన కన్వేయన్స్ డీడ్‌ను రద్దు చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి బీఆర్‌ఎస్ పార్టీకి నోటీసులను అందజేయాలని న్యాయవాదికి సూచించింది. ప్రభుత్వ వివరణ నిమిత్తం విచారణను వాయిదా వేసింది.

కోకాపేటలో భూ కేటాయింపుపై వివరణ కోరిన న్యాయమూర్తి

హనుమకొండలో బీఆర్‌ఎస్‌కు నోటీసులపై ఉత్తర్వులు 30న

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): హనుమకొండలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఎకరా స్థలం కేటాయింపు వివరాలను సమర్పించాలంటూ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జారీచేసిన నోటీసులను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్‌పై ఈ నెల 30న ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు బుధవారం ప్రకటించింది. బీఆర్‌ఎస్ పిటీష న్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టగా, గత ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్‌కు స్థల కేటాయింపును రద్దు చేయాలంటూ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఆర్డీవోకు రాసిన లేఖను ప్రభుత్వం సమర్పించింది. ఈ లేఖలో ఎమ్మెల్యే స్థల కేటాయింపును రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేయలేదని, విజ్ఞప్తి మాత్రమే చేశారని న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు.

అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ వాళ్లకు హనుమకొండలో కేటాయించిన స్థలం స్థానంలో వరంగల్‌లో అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్యెల్యే ఇంటి పక్కన స్థలం కేటాయించాలని ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి కోరారని అన్నారు. బీఆర్‌ఎస్‌కు హనుమకొండలో కేటాయించిన స్థలం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కుడా) పరిధిలోకి వస్తుందని తెలిపారు. అందువల్ల ఈ స్థలాన్ని బీఆర్‌ఎస్‌కు కేటాయిం చాలంటూ కలెక్టర్ కుడాకు లేఖ రాసినా ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.  ఆ స్థలం పార్కుకు కేటాయించినందున కుడా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. ఆ స్థలంలో అనుమతుల్లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి దీనిపై 30న విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ వాయిదా వేశారు.