04-05-2025 12:11:53 AM
తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయకుండా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం మాట వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ, స్వరాష్ట్రం ఏర్పడేంతవరకు గడ్డం, మీసం తీయబోనంటూ.. 2009 డిసెంబర్ 23న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెంది న చాగంటి కిషన్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ మేరకు చాగంటి కిషన్ 2014 జూలై 2 న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడేంతవరకు ఐదేళ్లపాటు పెంచిన గడ్డం మీసంతోనే జీవనం సాగించాడు.
వామపక్ష భావజాలం కలిగిన చాగంటి కిషన్ తన కవిత రచనలతో పాటు వక్తగా మలిదశ ఉద్యమంలో ముందుండి నడిచారు. ఈ క్రమంలో ఆయనపై అనేక కేసులు పెట్టారు. అయినప్పటికీ అదరక.. బెదరక ఉద్యమంలో మరింత ముందుకు సాగారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుపై వెనక్కి తగ్గడంతో కిషన్ చేపట్టిన విభిన్న నిరసనకు అనేకమంది ఛీత్కరించినా మొక్కవోని దీక్షతో స్వరాష్ట్రం సిద్ధించే వరకు దీక్ష విరమించేది లేదని తన పంథాన్ని కొనసాగించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014 ఆగస్టు 4న జనగామ జిల్లా కడవెండిలోని దొడ్డి కొమరయ్య స్తూపం వద్ద కేశఖండనం చేయించుకొని దీక్షను విరమించారు. ఐదేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు జరగగా, అందులో చాగంటి కిషన్ పెంచిన గడ్డం, మీసంతో పాల్గొని తన కవితా గానంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్
ప్రభుత్వం ఆదుకోవాలి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వెనుకబాటుతనాన్ని తొలగించడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యమని నమ్మను. మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడం లక్ష్యంగా పెట్టుకుని కొడకండ్ల మండలం మొండ్రాయి చెందిన మోహన్ గాంధీ అర గుండు, సగం మీసంతో చేపట్టిన దీక్షను స్ఫూర్తిగా తీసుకొని గడ్డం మీసం పెంచాను. ఈ సమయంలో అనేకమంది పెంచిన గడ్డం మీసాలను చూసి గడ్డం మీసం పెంచితే తెలంగాణ వస్తుందా అంటూ.. ఛీత్కరించుకున్నా సహనంతో భరించాను.
ఎన్ని అడ్డంకులు అవరోధాలు, కేసుల పాలు చేసినా ఎంచుకున్న పంథాను స్వరాష్ట్రం వచ్చేంతవరకు విడిచిపెట్టలేదు. అయితే వచ్చిన స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపు లేదు. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నా.. ఇంటి స్థలం, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నా.
- చాగంటి కిషన్, తెలంగాణ ఉద్యమకారుడు