calender_icon.png 5 May, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనికిరాని ‘కాళేశ్వరం’

05-05-2025 01:15:34 AM

  1. ప్రాజెక్టుకు పెట్టిన సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు
  2. అవే నిధులు ఇతర ప్రాజెక్టులన్నింటికీ సరిపోయేవి..
  3. యావత్ తెలంగాణ సస్యశ్యామలమయ్యేది..
  4. ఎస్‌ఎల్‌బీసీ పనులపై ఎక్స్‌పర్ట్స్ కమిటీ నియమిస్తాం..
  5. నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  6. మిర్యాలగూడలో ఆయాశాఖలపై సమీక్షా సమావేశం

నల్లగొండ, మే 4(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందని  రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైసాకు పనికిరాదని, దీనిపై వెచ్చించిన రూ. 96 వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరైందని పేర్కొన్నారు.

మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇరిగేషన్, పౌరసరఫరాలశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరానికి వెచ్చించిన నిధులను ప్రాణహిత, డిండి, ఎస్‌ఎల్‌బీసీ, దేవాదుల, పాలమూరుె రంగా రెడ్డి, సీతారామ తదితర ప్రాజెక్ట్‌లపై వెచ్చించి ఉంటే, ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయ్యేవని యావత్ తెలంగాణ సస్యశ్యామలమయ్యేదని అభిప్రాయపడ్డారు.

పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఏ ప్రాజెక్ట్‌నూ పూర్తి చేయలేకపోయిందని నిప్పులు చెరిగారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు రూ.23 వేల కోట్లు, సీతమ్మ సాగర్‌కు రూ.8 వేల కోట్లు వెచ్చిస్తే కొత్తగా వచ్చిన ఆయకట్టు గుండు సున్నా అని మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ‘అతి తక్కువ సమయంలో తక్కువ నిధులు వెచ్చించి.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లివ్వడమే’ తమ ప్రభుత్వ నినాదమని మంత్రి నొక్కిచెప్పారు.

కృష్ణాజలాల వాటా కోసం కొట్లాడినం

కృష్ణా జలాల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 512 టీఎంసీలు ఆంధ్రాకు, 218 టీఎంసీలు తెలంగాణకు కేటాయింపులు జరిగాయని, అందుకు గత ప్రభుత్వం అంగీకరించి రైతులకు అన్యాయం చేసిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. 40 50 ఏండ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో సాగు నాగార్జున్‌సాగర్ జలాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము కృష్ణా జలాల విషయంలో చాలా పట్టింపుగా ఉన్నామని తేల్చిచెప్పారు. కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు, 30శాతం వాటా ఆంధ్రాకు కేటాయించాలనే డిమాండ్‌ను ఎత్తుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎదుట ప్రతిపాదనలు ఉంచామని, కేటాయింపుల విషయంలో పునరాలోచించాలని కోరామని తెలిపారు.

తమ వాదనలను బ్రిజేశ్ ట్రిబ్యునల్ అంగీకరించి కృష్ణా జలాలను న్యాయబద్ధంగా కేటా యించేందుకు సిద్ధమైందని స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన నైతిక విజయమని కొనియాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు నాగార్జునసాగర్, ఎస్‌ఆర్‌ఎస్పీతో పాటు రిజర్వాయర్ల నిర్వహణను పట్టించుకోలేదని, దీంతో ఆయా ప్రాజెక్ట్‌ల్లో సిల్ట్ పేరుకుని నిల్వసామర్థ్యం తగ్గిపోయిందని వివరించారు.

తమ ప్రభుత్వం తిరిగి ప్రాజెక్ట్‌లు, రిజర్వాయర్ల నీటి నిల్వసామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటుంద ని హామీ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత నీటిపారుదలశాఖ బలహీనపడ్డదని, ఈ శాఖ లో రిక్రూట్‌మెంట్ల సంగతిని కేసీఆర్ ప్రభు త్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాలువ లు, ప్రాజెక్ట్ గేట్లను పర్యవేక్షించే లష్కర్ వ్యవస్థ సుప్తావస్థలోకి వెళ్లిందని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు దఫాల్లో 1,100 ఇంజినీర్లను కొత్తగా నియమించామని తెలిపారు. అలాగే 1,800 మంది లష్కర్లను ఔట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేశామని, తద్వారా ఇరిగేషన్‌శాఖను బలోపేతం చేశామన్నారు. తమ ప్రభుత్వం నీటిపారుదులశాఖకు ప్రాధాన్యమిస్తుందని, రాష్ట్ర బడ్జెట్‌లో ఈశాఖకు రూ.23 వేల కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమన్నారు. 

ఎస్‌ఎల్‌బీసీ పనులపై ఎక్స్‌పర్ట్స్ కమిటీ..

ఎస్‌ఎల్‌బీసీ పనులు కాస్త వెనుబడిన సంగతి వాస్తవమేనని, పనులపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి తెలిపారు. పనులపై త్వరలోనే జాతీయస్థాయిలో అనుభవజ్ఞుల (ఎక్స్‌పర్ట్స్) కమిటీ నియమిస్తామని తెలిపారు. సాంకేతికత సమస్యలను పరిష్కరించి టన్నెల్ పనులను పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు.

ఉమ్మడి నల్లగొండకు సాగు, తాగునీటిని సరఫరా చేసి జిల్లావాసుల చిరకాల వాంఛను తీరుస్తామని తెలిపారు. అలాగే డిండి, గంధమల, ఉదయ సముద్రం ప్రాజెక్ట్‌లు కూడా గత పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయని, తాము తిరిగి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ పూర్తయిందని వెల్లడించారు.  

ధాన్యం ఉత్పత్తిలో ఆల్ టైం రికార్డ్..

గతేడాది వానకాలంలో 66.7 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 153 లక్షల మెట్రిక్ ధాన్యం చేతికి వచ్చిందని గుర్తుచేశారు. ఈ యాసంగిలో 55 లక్షల ఎకరాల్లో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికొస్తున్నదని తెలిపారు. ఇవన్నీ ఆల్ టైం రికార్డు అని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత ధాన్య పండదని స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేశామన్నారు.

యాసంగిలో చేతికొచ్చిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు.  నిరుపేదలకు గతేడాది దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, అవి రీసైక్లింగ్‌కు వెళ్లేవని, జనం తినడానికి ఆ బియ్యం పనికి వచ్చేది కాదని గుర్తుచేశారు.  ఈమాత్రం దానికి ప్రభుత్వానికి రూ.10వేల కోట్లకుపైగా ఖర్చయ్యేదన్నారు. తమ ప్రభుత్వం ఏటా రూ.13 వేల కోట్లు వెచ్చించి, రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ, మునుగోడు ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి , కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం, సివిల్ సప్లుసై ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్, ఇరిగేషన్ కార్యదర్శి వినయ్‌కృష్ణారెడ్డి, యాద్రాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, సూర్యాపేట కలెక్టర్ తేజాస్ నందలాల్, నల్లగొండ కలెక్టర్ అమిత్ తదితరులు పాల్గొన్నారు.

నాకు నచ్చిన పథకం సన్నబియ్యం పంపిణీ

ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి వారి కడుపునింపుతున్నామని, అన్ని పథకాల కంటే తనకు నచ్చిన పథ కం సన్నబియ్యం పథకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని, ప్రజలు తమదే నిజమైన ప్రజాపాలన అని కొనియాడుతున్నారని వెల్లడించారు.

ఉమ్మడి జిల్లా వాసుల తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎస్‌ఎల్‌బీసీ పనులను పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తయ్యాయని, తమ ప్రభు త్వం ఒక్కో లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందు వెళ్తున్నదని తెలిపారు. గత ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదని మండిపడ్డారు.

కనీసం ధార్మారం పంట కాలువలను సైతం బాగు చేయలేదనిధ్వజమెత్తారు.  తెలంగాణకు నిజమైన విలన్ కాంగ్రెస్ అని ఇటీవల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారని మంత్రి మండిపడ్డారు. ‘స్వరాష్ట్రం ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అవుతుందా?’ అని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎంగా ప్రజలకు సేవ చేయకుండా ఫాంహౌస్‌లో టైంపాస్ చేసిన నేత.. ఇప్పుడు తమ కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల చౌక దుకాణాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని గుర్తించి వెంనటే పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌కు కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు.