05-05-2025 01:07:37 AM
వానకాలానికి అధికారుల యాక్షన్ ప్లాన్
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణలో యాసంగి వరి కోతలు చివరి దశకు వచ్చాయి. మరో నెలన్నరలో వానకాలం రానున్నది. రైతులు ఏటా రోహిణి కార్తె ప్రారంభం కాగానే వరి మొలకలు అలకడం ప్రారంభిస్తారు. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుకు దుక్కులను సిద్ధం చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ సాగుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నది.
వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నది. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నది. రైతులు ఎప్పటిలాగానే వరి సాగుకే ప్రాధాన్యమిస్తున్నట్లు భావిస్తున్నది.
రాష్ట్రప్రభుత్వం సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తుండడంతో ఎక్కువ మంది రైతాంగం వరి సాగుకు సిద్ధమవుతున్నట్లు గుర్తించింది. వరి తర్వాత రైతులు వాణిజ్య పంట అయిన పత్తిపై దృష్టి సారిస్తున్నారని తెలిపింది.
సాగు అంచనా ఇలా..
వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయనుండగా.. దీనిలో 66.80 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. ఆ తర్వాతి స్థానంలో పత్తి పంట 50 లక్షల ఎకరాల్లో సాగవుతుందని భావిస్తున్నది.
అలాగే రైతులు 5.40 లక్షల ఎకరాల్లో మక్కలు, 5.10 లక్షల ఎకరాలో ్లకంది, 1.90 లక్షల ఎకరాల్లో మిర్చి, 4.10 లక్షల ఎకరాల్లో సోయాబిన్, 65 వేల ఎకరాల్లో పెసర్లు, 28 వేల ఎకరాల్లో మినుములు, 26 వేల ఎకరాల్లో వేరుశనగ,సాగు చేస్తారని అంచనా. అలాగే చాలా తక్కువ మొత్తంలో నువ్వులు 650 ఎకరాలు, పొద్దు తిరుగుడు 150 ఎకరాలు, కుసుమలు 3,600 ఎకరాలు, జొన్నలు 39వేల ఎకరాలు, సజ్జలు 1,200 ఎకరాల్లోనే సాగయ్యే అవకాశం ఉందని అంచనా.
సాగుకు అనుగుణంగా విత్తనాలు..
రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయశాఖ 16.70 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 0.48 లక్షల మక్కల విత్తనాలు, 95 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 1.35 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలను సిద్ధం చేస్తున్నది. వానకాలం నుంచే ఫసల్ బీమా అమలు చేయాలనే ఆలోచనలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉన్నట్లు తెలిసింది. మొత్తం బీమా ప్రీమియంలో రైతుల వాటా యాసంగిలో 1.5 శాతం, వాణిజ్య, ఉద్యాన పంటలకు 5 శాతం ఉంటుంది.
మిగిలిన ప్రీమియంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి 50:50 నిష్పత్తిలో చెల్లించనున్నాయి. దిగుబడి అధారిత బీమా పథకం కింద వరి, మక్కలు, కందులు, మినుములు, సోయాబిన్, వేరుశనగ, శనగ, నువ్వులు మొదలైన పంటలు ఉంటాయి. వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్‌పాం, టమాటా, బత్తాయి పంటలకు బీమా వర్తింపజేసే విధంగా వ్యవసాయశాఖ కసరత్తు చేస్తున్నది.