calender_icon.png 5 May, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమకారులకు గుర్తింపేది?

04-05-2025 12:13:49 AM

తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓల పాత్ర ఎంతో కీలకమైంది. టీఎన్జీవోలను ఏకతాటిపైకి తీసుకువచ్చి.. జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా  ఏర్పడి ఉద్యమాన్ని ముందుండి నడిపించడంలో మెదక్ జిల్లా మాజీ టీఎన్జీవో అధ్యక్షుడు మేడిశెట్టి శ్యాంరావు కీలకంగా వ్యవహరించారు. విభిన్న రీతిలో ఉద్యమానికి ఊపిరిపోసి స్వరాష్ట్ర సాధనకు కంకణబద్ధులై పనిచేశారు. మేడిశెట్టి శ్యాంరావు ’విజయక్రాంతి’తో ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

స్వరాష్ట్రం సాధించి దశాబ్దానికి పైగా పూర్తయినా ఉద్యమకారులకు రాజకీయ రంగంలో సరియైన గుర్తింపు లభించలేదు. అంగబలం, అర్థబలం ఉన్న వారినే నాయకులుగా గుర్తిస్తున్న పార్టీలు ఉద్యమంలో కీలకపాత్ర వహించి మరుగున పడుతున్న వారికి అవకాశాలు కల్పించడం లేదు. కేవలం ఆర్థికంగా ఎదిగిన వారికే అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విధానంలో మార్పు రావాలి. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ ఉద్యమం ఊపిరిపోసుకుంటుండగా స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యోగులంతా నడుం బిగించారు. అయితే వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమానికి నాంది పలకాలని జేఏసీగా ఏర్పడ్డాం.

1986లోనే ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కార్యా చరణ సమితికి చైర్మన్‌గా ఎన్నికయ్యా. 1997లో మెదక్ టీఎన్జీవో భవన నిర్మాణం చేపట్టడంలో కీలకపాత్ర పోషించా. ఉద్యోగ సంఘాల నాయకునిగా 1999 నుండి 2004 వరకు మూడు పర్యాయాలు మెదక్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎ న్నికయ్యా. 2001లో రాష్ట్రంలోనే కనీవినీ ఎరుగని రీతిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించాం. 2007లో జిల్లా టీఎన్జీవోల అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నియ్యాను.

2008లో ప్రత్యేక తెలంగాణ ఉ ద్యమం గురించి సంగారెడ్డికి బదిలీ అయ్యా. 2008  వరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశాం. 43 రోజులు సకల జనుల సమ్మె నిర్వహించాం. సాగరహారం, వంటావార్పు, సహాయ నిరాకరణ, సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన నిర్వహించాం. సంగారెడ్డిలో ధర్నాలు, రాస్తారోకోలు, పట్టణ బంద్‌లు, అర్ధనగ్న ప్రదర్శనలు చే యడమే కాకుండా కుటుంబ సమేతంగా మహాధర్నాలో పాల్గొన్నాం. ఉద్యమ సమయంలో నేను 29 సార్లు అరెస్టయ్యా.

బైండోవర్ సైతం అయ్యా. 2014లో నూతన జిల్లా ఏర్పాటు కావడంతో మెదక్‌కు బదిలీ అయ్యాను. జిల్లా కేంద్రంగా టీఎన్జీవోల యూనియన్ జిల్లా కన్వీనర్‌గా ఎన్నిక, తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఎన్నియ్యాను. ఉద్యమంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి అనేక రకాల ఉద్యమాలు చేశా. 100 రోజులు.. వంద ప్రమోషన్లు అనే నినాదంతో 104 పదోన్నతులు రావడాని కి కృషి చేశాం. ఆల్ ఇండియా స్టేట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నిర్వహించిన.. దేశవ్యాప్త సమావేశాలలో ఢిల్లీ, ముంబాయి, బీహార్, పాట్నా, చంఢీగర్, విజయవాడ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డెలిగేట్‌గా పాల్గొన్నా. 

 ఎ.చంద్రశేఖర్‌రావు, మెదక్

పరిపాలన విభాగంలో..

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘం నాయకునిగా ఎన్నో కార్యక్రమాలు చేశా. అయితే స్వరాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు రాజకీయాల్లో అవకాశాలు లభించడం లేదు. ఒకరిద్దరికి మినహాయిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఉద్యమకారులను ఏ పార్టీలు గుర్తించడం లేదు.

ఉద్యోగుల సమస్యలపై, మెదక్ పట్టణ అభివృద్ధికి, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొంటూ కేసులు, బైండోవర్లను ఎదుర్కొన్న వారికి ప్రజాసేవ చేసే అవకాశం మాత్రం లభించడం లేదు. కేవలం డబ్బు, పరపతి కలిగిన వారికే పార్టీలు అందలమెక్కిస్తున్నాయి. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తే ప్రజా సేవకు చేస్తారని నా అభిప్రాయరం. 

 టీఎన్జీవో నేత మేడిశెట్టి శ్యాంరావు