calender_icon.png 1 August, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా నిర్దోషులే

01-08-2025 12:55:56 AM

  1. మాలేగావ్ కేసులో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌కు ఊరట
  2. ఉగ్రవాదానికి మతం లేదన్న ఎన్‌ఐఏ కోర్టు
  3. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్న న్యాయస్థానం
  4. తీర్పుపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి

ముంబై, జూలై 31: దేశప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన 17 ఏండ్ల నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు గురువారం కీలక తీర్పు వెల్లడించింది. మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురు నిర్దోషులని ఏకే లాహోటీ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. ధర్మాసనం స్పందిస్తూ.. ‘కేసు దర్యాప్తు, ప్రాసి క్యూషన్ వాదనలో అనేక లోటుపాట్లున్నాయి.

ఈ కేసుకు ఉపాచట్టం వర్తించ దు. పేలుడుకు వినియోగించిన మోటార్ బైక్ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేర రిజిస్టర్ అయిందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవు. బైక్‌కు అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాల్లేవ్. ఉగ్రవాదానికి మతం లేదు. కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరినీ కోర్టులు శిక్షించవు.

బెనిఫి ట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాం టి బలమైన ఆధారాల్లేవు’ అని పేర్కొం టూ తీర్పు వెలువరించింది. ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ. 50 వేల ఆర్థికసాయం అందించాలని సూచించింది. కోర్టు ప్రకటించిన ఏడుగురు నిర్దోషులు: 1.ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ (భోపాల్ మాజీ ఎంపీ) 2. లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ 3. మేజర్ రమేష్ ఉపాధ్యాయ (రిటైర్డ్) 4. సమీర్ కులకర్ణి 5. అజయ్ రహిర్‌కర్ 6. సుధాకర్ ద్వివేది 7. సుధాకర్ చతుర్వేది

ఏమిటీ మాలేగావ్ కేసు?

దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 200కిలో మీటర్ల దూరంలో ఉన్న మాలేగావ్ అనే పట్టణంలో రంజాన్ నెల సందర్భంగా సెప్టెంబర్ 29 2008లో ఓ మసీదు వద్ద బాంబు పేలి ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో మరో వంద మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్కాడ్ (ఏటీఎస్) దర్యాప్తుకు స్వీకరించింది.

దర్యాప్తులో భాగంగా పలువురిపై అభియోగాలను మోపింది. జనవరి 2009లో బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌తో సహా 12 మందిపై ఏటీఎస్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కావాలనే కుట్ర చేసి, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారని ఏటీఎస్ ఆరోపించింది.  

2011లో ఎన్‌ఐఏ చేతికి..  

ఈ పేలుళ్ల కేసును ఏటీఎస్ 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. ఎన్‌ఐఏ మే 13 2016లో ఈ కేసులో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. భోపాల్, ఇండోర్ మొదలైన ప్రాంతాల్లో అనేక రహస్య సమావేశాలు కూడా నిర్వహించారని ఏటీఎస్ పేర్కొంది. ఏటీఎస్ ఆరోపణల ప్రకారం.. పేలుడుకు ఉపయోగించిన మోటార్ సైకిల్ బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరే రిజిస్టర్ అయి ఉంది. మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్ (మోకా) కింద నిందితులందరిపై అభియోగాలు మోపింది.

ఎన్‌ఐఏ 2011 నుంచి 2016 వరకు ఠాకూర్‌పై తీవ్ర అభియోగాలు మోపింది. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు.. ఎన్‌ఐఏ 2016లో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో ఠాకూర్‌పై ఉన్న అన్ని అభియోగాలు తొలగించింది. మిగతా నిందితులందరి మీద ఏటీఎస్ ఆరోపణల్నే కొనసాగించింది. 2016లో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కూడా చార్జ్‌షీట్ నమోదు చేసింది. 

ఇది నా జీవితాన్ని నాశనం చేసింది: ప్రజ్ఞాసింగ్ ఠాకూర్

ఎన్‌ఐఏ కోర్టు తీర్పుపై మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ స్పందించారు. అనవరసంగా నాపై నిందలు మోపి విచారణల పేరుతో హింసిచారని ఆరోపించారు. ‘విచారణకు పిలిచిన ప్రతిసారి నేను నిర్దోషిననే చెబుతున్నాను. కానీ వారు నన్ను విచారణల పేరుతో వేధించారు. ఈ కేసు నా జీవితాన్ని నాశనం చేసింది. సాధ్విగా ఉన్న నాపై లేనిపోని ఆరోపణలు మోపారు. ఎవరూ నావైపు నిలబడలేదు. నేను సన్యాసిని కాబట్టి ఇంకా బతికి ఉన్నాను’ అని అన్నారు. 

మరి ఎవరు చంపారు?

కోర్టు తీర్పుపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పేలుళ్ల ఘటనలో అందరూ నిర్దోషులైతే ఆరుగురి చావుకు కారణం ఎవరు అని ప్రశ్నించారు. ‘కోర్టు తీర్పు నిరాశపర్చింది. మతం ఆధారంగానే టార్గెట్ చేసి పేలుడుకు పూనుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే దర్యాప్తు సరిగ్గా సాగలేదు. ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రభుత్వాలు అప్పీల్‌కు వెళ్తాయా?’ అని ప్రశ్నించారు.